ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ అధినాయకత్వం ఇప్పటికీ సస్పెన్షన్ వేటు వేయలేకపోయింది. కానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారన్న నెపంతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ అధినాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయాన్ని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అంతేనా, ఒక్కో ఎమ్మెల్యేకీ పది నుంచి పదిహేను, ఇరవై కోట్ల రూపాయలు చెల్లించి చంద్రబాబు కొనుగోలు చేశారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించడం గమనార్హం. అంటే, నలుగురు ఎమ్మెల్యేలకీ దాదాపు 40 నుంచి 80 కోట్ల వరకు టీడీపీ ఖర్చు చేసిందన్నమాట.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీ మీద తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ వచ్చారు. అప్పట్లో ఆయన్ని ఉపేక్షించిన వైసీపీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సాకు చూపి, క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. చిత్రమేంటంటే, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తాను వైసీపీ అభ్యర్థికే ఓటేశాననీ, తన మీద క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వైసీపీ అధినాయకత్వం చేయడం శోచనీయమనీ అంటున్నారు.
సస్పెండ్ అయినవారిలో ఆనం రామనారాయణరెడ్డితోపాటు వుండవల్లి శ్రీదేవి కూడా వున్నారు. వుండవల్లి శ్రీదేవి సైతం తాను వైసీపీ అభ్యర్థికే ఓటేశానని చెప్పడం కొసమెరుపు. వుండవల్లి శ్రీదేవిపై వేటు వేసినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన కాస్సేపటికే ఆమె కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.
కాగా, తమ ఓట్లు తమకే పడ్డాయనీ, క్రాస్ ఓటింగ్ పేరు చెప్పి వైసీపీ ఎమ్మెల్యేల మీద వైసీపీ అధినాయకత్వం వేటు వేసుకుంటే అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమనీ, ముందు ముందు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు రావడం ఖాయమని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు జోస్యం చెబుతుండడం కొసమెరుపు.