మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి నేరుగా చంద్రబాబు ముందే.. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడం అనవసరం. పోటీచేసి డబ్బులు వదిలించుకుని జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది?’ అని చంద్రబాబు ఎదుటే జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ పార్టీ శ్రేణుల్లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చనీయాంశమయ్యాయి.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జేసీకి కొత్త కాకపోయినా.. ఇప్పుడు ఆయన తీరుపై గతంలో ఆయన వర్గీయుల నుంచే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, గ్రామాల్లో పార్టీ క్యాడర్‌ని కాపాడుకోవాల్సింది పోయి ఎన్నికల్లో పోటీ చేయడమే వద్దంటూ మాట్లాడటం సరికాదని జేసీని నిలదీస్తున్నారట. ఈ నేపథ్యంలోనే జేసీ దివాకర్‌రెడ్డి అధినేత చంద్రబాబుతో సమావేశమై మరీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని జేసీ వ్యాఖ్యానించగా చంద్రబాబు దానికి సమాధానంగా.. ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని, నమ్ముకున్న నేతలకు, కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని పలికారట. దీంతో ‘నేను వైసీపీకి భయపడటం లేదు. కొత్త చట్టాన్ని ఎవరిపై ఎక్కుపెడతారో తెలిసి మాట్లాడుతున్నాను’ అని దివాకర్‌రెడ్డి స్పష్టంచేశారు.
అయితే అక్కడితో ఆగని జేసీ.. ‘2024లో మీరు మళ్లీ సీఎం అవుతారు. కానీ, అప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. మీరు చెయ్యగలిగింది కూడా ఏమీ ఉండదు’ అని మాట్లాడారు. దీనికి చంద్రబాబు కూడా ‘నేను బతికి ఉండగా ఈ రాష్ట్రాన్ని నాశనం కానివ్వను. మళ్లీ బాగుచేసే వెళతాను’ అని అనడంతో జేసీ దివాకర్‌రెడ్డి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారట.
ఈ విషయాలన్నీ స్వయంగా జేసీ మీడియా ముందు వెల్లడించారు. పనిలోపనిగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది, అది పతాకస్థాయికి వెళ్లాలంటే ఇంకా సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చెయ్యాలి. ఆ తర్వాత 2024లో చంద్రబాబు సీఎం అవుతారు.. అప్పటికి రాష్ట్రం అంతా నాశనం అయిపోయి ఉంటుంది అని జోష్యం కూడా చెప్పారు జేసీ.