స్థానిక ఎన్నికల్లో వైసీపీ త్రిబుల్ సెంచరీ.. నామినేషన్ల ఉపసంహరణ పూర్తైతే మరో 200లు ఖాయం

అధికార పార్టీ ఎత్తుగడల ఫలితాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఏకగ్రీవం అయితే ప్రభుత్వం ప్రకటించిన తాయిలాల ఫలితమో ఏమో రాష్ట్ర వ్యాప్తంగా 300లకు పైగా ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవమైనాయి. వీటన్నింటిని అధికార వైసిపి కైవసం చేసుకోవడం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు నింపుతున్నాయి.

ఇక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి ఏకగ్రీవాల సంఖ్య మరింత పెరగనుందని తెలుస్తోంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తరువాత ఏకగ్రీవమైన స్థానాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించనుంది. అప్పటికి, మరో 200 స్థానాలు ఏకగ్రీవంగా అదీ వైసీపీనే కైవసం చేసుకుంటుందన్న ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

వైసీపీ నేతలకు ఆనందం.. ప్రతిపక్ష పార్టీకి ఆందోళన కలిగించే మరో అంశం.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే వైసిపి అత్యధిక స్థానాలను ఏకగ్రీవంగా సాధించడం. ఈ జిల్లాలో 100కు పైగా స్థానాలను ఆ పార్టీ పొందినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానం మాత్రమే ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది.

మొత్తంగా అధికార వైకాపా ఎత్తుగడలు, రాష్ట్రంలో నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల ఫలితం అన్నీ వెరసీ ఈ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి భారీగా కలిసొస్తోంది. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నా సరే.. ఫలితాల జోరు బాగా కనిపిస్తోంది.