స్థానిక ఎన్నికలకు బ్రేక్ ! చంద్రబాబు కేసులో డిజిపి హాజరుకు ఆదేశం!

ఆంధ్ర లో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వైఖరి

రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ స్థానాలకు ఎందుకో సరిపడేట్టు లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అత్యధిక నిర్ణయాలను హైకోర్టు తప్పు పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిర్ణయాలు న్యాయ పరంగా నిలబడుతాయా? లేదా? అని సమీక్షించడం కొరవడటమే కారణంగా పలువురు భావిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు న్యాయ పరంగా నిలబడవని ముందుగానే అందరూ భావించారు. అయినా ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లతో జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేకనే ప్రభుత్వం జీవో జారీ చేసిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈ అంశం మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సుప్రీంకోర్టు హైకోర్టు విచారణకు బదలీ చేయడం జరిగింది. రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రూలింగ్ కు వ్యతిరేకంగా వున్న కారణంగా హైకోర్టు సోమవారం తీర్పు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టి వేసింది. బిసిల రిజర్వేషన్ 34 శాతం నుండి తగ్గించి నెలలోపల నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ తీర్పు ఇలా వస్తుందని ఎరిగిన టిడిపి నేతలు ప్రభుత్వంపై ఉదయం నుండే ఎదురు దాడి మొదలు పెట్టారు. బిసిల 34 శాతం రిజర్వేషన్ లో కోత పెట్టకుండా సుప్రీంకోర్టులో తిరిగి సవాలు చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి.బిసిలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించి క్రెడిట్ కొట్టి వేయాలని అదే సమయంలో కోర్టులో నిలబడక పోతే నెపం టిడిపిపై నెట్టాలని అధికార పార్టీ వ్యూహం పన్నింది. అంతకు ముందుగానే టిడిపి నేతలు బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు వుండాలని ఎదురు డాడి ప్రారంభించారు. ఎవరు ఏం నాటకాలాడినా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఇదివరలోనే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చివున్నందున ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దీని ఫలితంగా బిసిలకు పెట్టిన 34 శాతం రిజర్వేషన్లు తగ్గించ వలసి వుంది.

ఇదిలా వుండగా పులి మీద పుట్ర లాగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుండి చంద్రబాబు నాయుడును తిరిగి పంపడంపై మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ తిరిగి సోమవారం హైకోర్టు విచారించింది. డిజిపి విశాఖ పట్నం సిపి ఇద్దరూ కౌంటర్ వేయాలని గతంలో ఆదేశించడంపై విచారణ జరిపిన హైకోర్టు సిపి వేసిన కౌంటర్ సంత్రుప్తిగా లేదని వ్యాఖ్యానించింది. ఈనెల 12 వతేదీ డిజిపి నేరులో హైకోర్టుకు హాజరై 151 సెక్షన్ ఏవిధంగా అమలు జరిపారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.చట్టాలను తుంగలో తొక్కి పాలక వర్గ నేతలు చెప్పినట్లు అదీ ప్రతిపక్ష నేత అంశంలో వ్యవహరించినందున చట్టాలను అమలు చేసే పోలీసు అధికారులు తుదకు చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడ వలసి వస్తోంది.