సొంత ఎంపీకి షాకిచ్చిన జగన్… బిత్తరపోయిన నేతలు

అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పనిచేయాలని అధికారంలోకి వచ్చినప్పటిి సొంత పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిస్తూన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హెచ్చరికలు కాదు.. ఏకంగా సొంత పార్టీ ఎంపీపైనే చర్యలకు ఆదేశించడంతో బిత్తరపోవడం పార్టీ నేతల వంతైంది.

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన ఓ ఎంపీ కుటుంబంపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై చర్యలకు జగన్ ఆదేశాలు జారీ చేయడం ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతోంది.

విశాఖజిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ స‌త్య‌వ‌తి భర్త వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌తో నేప‌థ్యంలో వారి కుటుంబ ట్ర‌స్టుకు నిత్యావ‌స‌రాలు అంద‌క పోవడంతో.. ప్ర‌భుత్వ రేష‌న్ దుకాణాల‌కు వెళ్లాల్సిన బియ్యాన్ని ట్ర‌స్టు కార్యాల‌యానికి తరలించినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై విచారించిన అధికారులు 500 కేజీలు అక్రమంగా ట్రస్టు కార్యాలయానికి తరలిస్తున్నట్లు నిర్దారించారు. దీనికి బాధ్యులైన రేషన్ డీలర్‌ను కూడా సస్పెండ్ చేశారు.

ఓ ఉద్యోగిని, రేషన్ డీలర్‌ను సస్పెండ్ చేశారు.. అలాగే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఆ తర్వాత ఎంపీ కుటుంబంపై, ట్రస్ట్ పై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారట. ఇవన్నీ చూస్తుంటే.. జగన్ ఆదేశాలతోనే కేసులు పెట్టేందుకు అధికారులు ఉపక్రమించినట్లు టాక్ వినబడుతోంది. అలాగే అక్రమాలకు పాల్పడుతోన్న వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడటంపై హర్షం వ్యక్తమవుతోంది.