సుజనాకు బిజెపిలో క్లాస్ పీకారా ?

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి బిజెపి అగ్రనేతలు క్లాసు పీకారా ? ఇపుడిదే అనుమానం మొదలైంది. కరకట్ట మీద అక్రమనిర్మాణంలో చంద్రబాబునాయుడు నివాసం ఉండటంపై చాలా నీతులు చెప్పారు. అసలు కరకట్ట మీద అక్రమనిర్మాణంలో చంద్రబాబు ఇంకా ఎందుకుంటున్నారో తనకు అర్ధం కావటం లేదన్నారు. తానైతే అటువంటి ఇంట్లో ఉండేవాడు కాదని కూడా అనేశారు.

తానుంటున్న నివాసాన్ని కూల్చేస్తే సానుభూతి దక్కుతుందని చంద్రబాబు అనుకుంటున్నారేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది. మొన్నటి వరకూ చంద్రబాబుకు మద్దతుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో సుజనా విరుచుకుపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అమరావతి నిర్మాణం, పోలవరం రివర్స్ టెండర్లు, పిపిఏల సమీక్ష లాంటి అనేక అంశాలపై జగన్ పై తీవ్రంగానే ఆరోపణలు, విమర్శలు చేశారు. ఏదో మొక్కుబడిగా చంద్రబాబును ఓ మాటంటున్నా అసలైన టార్గెట్ మాత్రం జగన్ అన్నట్లుగానే సాగేది సుజనా ఆరోపణలు. హోలు మొత్తం మీద చూస్తే చంద్రబాబుకు అనుకూలంగానే బిజెపిలో ఓ వర్గాన్ని రెడీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.

సుజనా రాజకీయంపై కొందరు సీనియర్ నేతలు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేశారట. చంద్రబాబు అనుకూల వైఖరికి మద్దతుగా కొన్ని ఆధారాలను కూడా చూపారని సమాచారం. దాంతో జాతీయ నాయకత్వం సుజనాకు క్లాసు పీకిందనే ప్రచారం మొదలైంది. అందుకనే ఒక్కసారిగా చంద్రబాబుపై సుజనా ఎటాక్ చేశారని అనుకుంటున్నారు.