ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల పరిస్థితి. ప్రభుత్వం చెప్పినట్లు వినాలా లేక రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలా అన్నది వారికి సంకటంగా మారిపోయింది. ఏ దిశగా చర్యలు తీసుకున్నా రాజకీయంగా, పాలనా పరంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు వారికి.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి పెద్ద వార్ నడుస్తోంది. ఈ వార్‌లో ఇప్పుడు అధికారులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనల ఆధారంగా చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లను, గుంటూరు రూరల్, తిరుపతి అర్బన్ ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. మరో ఇద్దరు సీఐలతో పాటు మాచర్ల ఘటనలో సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇక్కడే ఉన్నతాధికారులకు చిక్కు వచ్చి పడింది. నార్మల్‌గా అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే వారేమో.. కానీ ఇక్కడ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో అధికారులపై చర్యలు తీసుకుంటే.. ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది అనే అనుమానాలతో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పైగా ప్రభుత్వ తీరు చూసిన తర్వాత అలాంటి అవకాశాలు కూడా లేవనే తెలుస్తోంది. ఆరు వారాల తర్వాత గానీ, అంతకన్నా ముందు గానీ మరి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ తిరిగి ప్రారంభమైనప్పుడు అయినా ఎన్నికల సంఘం ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరిపారు. ఆ తర్వాత.. ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ తదితర అంశాలపై గవర్నర్‌ను కలిసి చర్చించారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మద్య వార్ అంత త్వరగా ముగిసేలా లేదు. మరి చిలికి చిలికి ఈ వివాదం ఎక్కడిదాాకా వెళ్తుందో.. ప్రభుత్వ అధికారులకు ఏం తంటాలు తెచ్చిపెడుతుందో అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.