వైసీపీ కండువా కప్పుకోని కరణం బలరాం??

చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం సీఎం జగన్‌ను కలిశారు. ఐతే ఆయన మాత్రం వైసీపీలో చేరలేదు. కరణం తనయుడు వెంకటేష్‌కు మాత్రం సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.. పైగా కరణం బలరాం వైసీపీలో చేరలేదా అని వెంకటేష్‌ని అడిగితే ఆ మాట ఆయన్నే అడగండి అని సమాధానం చెప్పారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో నేతలు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. వీరిలో చంద్రబాబుకు సన్నిహితులు కూడా ఉండటం గమనార్హం. అయితే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు వైసీపీ కండువా కప్పుకోవడానికి మాత్రం ఓ చిన్న అడ్డంకి ఉంది. దాంతో టెక్నికల్ ‌గా టీడీపీలో ఉంటూ.. వైసీపీకి జై అనే సరికొత్త విధానానికి తెరతీశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఇప్పుడు కరణం బలరాం కూడా అదే బాట పట్టినట్లు తెలుస్తోంది.

పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయమని సీఎం జగన్ చెప్పారు కదా.. అలాగే ఎవరైనా తన పార్టీలో చేరాలి అనుకుంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని కూడా అన్నారు.. అందుకే… మధ్యే మార్గంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మార్గం ఎంచుకుంటున్నారు. ఆ లెక్కలోనే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీ జెండా కప్పుకోకుండా మేనేజ్ చేశారు. మరి వీరి బాటలోనే ఇంకెంత మంది ఎమ్మెల్యేలు టెక్నికల్ గా టీడీపీలో ఉంటూ, వైసీపీకి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారో…?