వైకాపా మైండ్ గేమ్.. కన్నాకు అధిష్టానం మద్దతు!

కన్నా లక్ష్మీ నారాయణ అవినీతి ఆరోపణలు.. విజయసాయి రెడ్డి వ్యక్తిగత దూషణలు.. వెరసి బీజీపీ అదిష్టానం ఇప్పుడు కన్నాకు మద్దతుగా నిలిచింది. ఇప్పటి వరకు బీజేపీ నుండి కన్నా ఒక్కడే వైకాపాపై విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు అందరినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు బీజేపీ చర్యలు చేపట్టింది.

కరోనా ర్యాపిడ్‌ టెస్టింగ్ కిట్ల వివాదంలో ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా తీవ్ర ఆరోపణలను ఎదురుకున్నారు. కన్నా అమ్ముడుపోయారని, ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ పంపిన డబ్బులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఏం చేశారో తెలుసు అంటూ విజయసాయి రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేసినా సరే.. బీజేపీలో ఎవరూ కూడా కన్నాకు మద్దతుగా వాటిని ఖండించలేదు.

దీంతో బీజేపీ అధిష్టానం విజయసాయి రెడ్డి విమర్శలను సీరియస్ గా తీసుకున్నట్లుంది. కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, మాధవ్‌, సోము వీర్రాజు వంటి వారితో బీజేపీ పెద్దలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని వివరాలు అడిగితెలుసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వైకాపా ట్రాప్‌లో పడొద్దని కూడా సూచించిందట.

ఈ సందర్భంగానే వైకాపా నేతలు విశాఖపట్నంలో తన సొంత స్థలాన్నే క్రమించిన విషయం కూడా కన్నా అదిష్టానానికి గుర్తు చేశారట. దీంతో వీటన్నిటిపై ఓ నివేదిక తయారు చేసి పంపాలని, బీజేపీ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల సంగతి తాము చూసుకుంటామని ఢిల్లీ పెద్దలు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇక కన్నా పరువు నష్టం దావాకు కూడా అధిష్టానం పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కన్నా కూడా ఆనందంగా ఉన్నారట.