వివేకానంద రెడ్డి హత్య కేసు : తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

జగన్మోహన్ రెడ్డి ఏ సుమూహూర్తాన ముఖ్యమంత్రి పదవి చేపట్టారో ఏమో గాని తన స్వంత కేసులు అటుంచి ప్రభుత్వ పరంగా కూడా కోర్టు కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి.టిడిపి హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో కేసు సిబిఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేతగా అప్పట్లో కోరారు. ఈ హత్య కేసులో ఒకటి రెండు సిట్ లు నియమింపబడినా ఏమీ తేల లేదు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే ఏమైందో ఏమో గాని వివేకానంద రెడ్డి కుమార్తె అల్లుడు ఇద్దరు కూడా కేసు సిబిఐకి అప్పగించాలని హైకోర్టుకెక్కారు. ఇదే సమయంలో ప్రభుత్వం సిబిఐ అక్కర లేదనీ విచారణ పూర్తి కావస్తుందని హైకోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ పరిస్థితి ఒక విధంగా ముఖ్యమంత్రికి ఇబ్బందికరమే.

ఈ కేసును సిబిఐకి అప్పగించడంపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాని వివేకానంద రెడ్డి కుమార్తె లాయరు సిబిఐకి అప్పగించాలని గట్టిగా కోరారు. కర్నూలు జిల్లాలో ఒక కేసు సిబిఐ కి అప్ప జెబుతామని ముఖ్యమంత్రి చెప్పారని ఇది కూడా సిబిఐకి అప్పగించాలని ఆమె తరపున లాయరు వాదించారు. టిడిపి హయాంలో కేసును తారుమారు చేస్తారని తాను అప్పట్లో సిబిఐ విచారణ కోరానని ప్రస్తుతం అవసరం లేదని అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రి తరపున కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వు చేశారు.

దురదృష్టమేమంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పలు కేసులు హైకోర్టు లో విచారణ పూర్తి అయి తీర్పులను న్యాయమూర్తులు రిజర్వు చేసి వున్నారు. కర్నూలు కు విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలు తరలించే అంశంపై జారీ చేయబడిన జీవో సవాల్ చేస్తూవేయబడిన కేసు విచారణ పూర్తి అయి తీర్పు రిజర్వులో వుంది.

అదే విధంగా గ్రామ సచివాలయాలకు పంచాయతీ ఆఫీసులకు వైసిపి జెండా రంగులు వేయడంపై కేసులు కూడా హైకోర్టు విచారణ చేసి తీర్పు రిజర్వు చేసి వుంది. ఇంకా కొన్ని ప్రైవేట్ సంస్థలు విద్యుదుత్పత్తి సంస్థలు వేసిన కేసులు ఇంకా ఇంకా చాలా హైకోర్టులో నలుగుతూ వున్నాయి. రాజధాని రైతులు వేసిన పలు కేసులున్నాయి. రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయబడిన కేసులు విచారణకే తన సమయం సరిపోయ్యేట్టు వుంది.