వినియోగదారులకు జియో షాక్

అన్నీ ఉచితం అంటూ ఇంత కాలం ఊరించిన జియో యాజమాన్యం వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇప్పటి నుండి జియో నెట్ వర్కు నుండి ఇతర మొబైళ్ళకు  చేసే ఫోన్లకు డబ్బులు చెల్లించాల్సిందే అంటూ నిర్ణయించింది. అంటే ఇప్పటి వరకు జియో ఫోన్ నుండి ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి ఏ ఇతర ఆపరేటర్లు నిర్వహిస్తున్న మొబైల్ నెంబర్లకు ఫోన్లు చేసినా పూర్తిగా ఉచితమే.

రిలయన్స్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంటే నిముషానికి 6 పైసలు చొప్పున కట్టాల్సిందే. జియో మొబైల్ ఫోన్ లాంచైన దగ్గర నుండి మొన్నటి వరకూ ఇన్ కమింగ్ తో పాటు ఔట్ గోయింగ్ కాల్సన్నీ ఉచితంగానే ఉండేది. అలాంటిది ఇపుడు హఠాత్తుగా ప్రతీ ఔట్ గోయింగ్ కాల్స్ నిముషానికి 6 పైసలు చెల్లించాల్సిందే అంటూ డిసైడ్ చేసింది.

అదే సమయంలో వాయిస్ కాలింగ్ చార్జికి సమానంగా 1 జిబి ఉచిత డేటాను అందించనున్నట్లు కూడా యాజమాన్యం చెప్పింది లేండి. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసి)ని ట్రాయ్ ఎత్తేసే వరకూ జియో కస్టమర్లకు ఈ వడ్డింపు తప్పదని యాజమాన్యం చెప్పటం గమనార్హం.

మామూలుగా ఏ కంపెనీ అయినా తమ ప్రోడక్టును మార్కెట్లోకి లాంచ్ చేసేముందు ఇంట్రడక్టరీ ప్రమోషన్ రూపంలో ఆల్ ఫ్రీ అని ఊరించటం సహజమే. పూర్తి ఉచితం అనే  సమయంలో కస్టమర్లకు రకరకాల సౌకర్యాలు కల్పిస్తారు. అయితే ఒకసారి కస్టమర్లు ఆ ప్రోడక్టుకు అలవాటుపడిన తర్వాత మెల్లిగా ఒక్కో సౌకర్యాన్ని తగ్గించుకుంటు వస్తారు. చివరకు ఆల్ ఫ్రీ స్ధానంలో ఎంతో కొంత ధర చెల్లించాలన్న నిబంధనను అమల్లోకి తెస్తారు.

ఇపుడు రిలయన్స్ యాజమాన్యం జియో ఫోన్ విషయంలో చేసింది కూడా ఇదే. దాదాపు రెండేళ్ళుగా అలవాటు పడ్డ జియో మొబైల్ కు అంచలంచెలుగా ధరలను అమలు చేస్తోంది.