ఆంధ్రప్రదేశ్‌లో తమ డిపార్ట్‌మెంట్ పరువు పోతోందని పలువురు పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ క్షణం కోర్టులు ఎవరికి ఆదేశాలు జారీ చేస్తాయోనని, తమ డిపార్టుమెంటుపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాయోనని ఆందోళన పడుతున్నారు. గతంలో ఏపీ పోలీసులు అంటే దేశవ్యాప్తంగా మంచి పేరుండేది, మానవ హక్కుల పరిరక్షణలోనూ మన రాష్ట్ర పోలీసులకు మంచి పేరే ఉంది. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరువు తీసేలా ఉన్నాయని పోలీసులే వ్యాఖ్యలు చేస్తుడటం కనిపిస్తోంది.
తాజాగా హెడ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్‌ను హైకోర్టు స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం మొత్తం డిపార్ట్‌మెంట్ పరువు కోర్టులో నిలబెట్టినట్లు అయ్యిందని పోలీసుల్లో ఆందోళన కనిపిస్తోంది. గతంలో విశాఖపట్నం పోలీసులు ఓ జంటను అరెస్ట్ చేసిన విషయంలోనూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను స్వయంగా హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబును అడ్డగించి, అరెస్టు చేయడంపై మార్చి 12న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇలాంటివి జరిగినప్పుడే పోలీసుల విధులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ జోక్యాలు లేకుండా పోలీసు వ్యవస్థను నిష్పక్షపాతంగా పనిచేయనిస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండదు కదా అన్న వ్యాఖ్యలు ప్రజల నుండి కాదు పోలీసు అధికారుల నుండే వినిపిస్తున్నాయి. ఓ వైపు నేరాలను అదుపుచేయడం కోసం పనిచేయాలా లేక ప్రతిపక్ష, అధికార పక్షాల ఆందోళనలు, నిరసనలపై దృష్టి సారించాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆందోళనలు, అడ్డుకున్నా, అడ్డుకోకపోయినా ఏం చేసినా న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సివస్తోందని అంటున్నారు.
పైగా ఇప్పుడు స్థానిక ఎన్నికల నగారా మోగింది. మార్చి నెల చివరికి స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఏలా ఉంటుందో చూడాలి.