రైతుల బతుకులు మారాలంటే.. ?    

 
రైతుల బాగు కోసం తెలంగాణలో  కేసీఆర్ ఒక ప్లాన్ వేశారు.  రైతులకు లాభం చేయాలంటే  నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు.. ఇదే  కేసీఆర్ ప్లాన్.  బాగానే ఉంది గాని,  ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేస్తారా ? ఎక్కడైనా  ఏరియాని బట్టి భూమిని బట్టి సాగు ఉంటుందనే విషయాన్ని  కేసీఆర్ ఆలోచించకుండా ఉండరని అనుకోలేం. అయినా అమ్మబోతే అడవి,  కొనబోతే కొరివి అనే నానుడి గురించి కేసీఆర్ కి తెలియకుండా ఎందుకు ఉంటుంది ?  రైతు పండించిన పంట అమ్ముదామంటే అమ్ముడుపోదు, కావాల్సిన వస్తువులు కొందామంటే విపరీతమైన ధరలు ఉంటాయి. ఈ పరిస్థితి కదా ముందు మారాల్సింది.
 
నేరుగా పంటలు పండించే రైతులు,  పనిచేసే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ది సాధించాలంటే, ఎలాంటి కొరత లేకుండా నీరు కరెంట్ అందుబాటులో ఉండాలి.  ముఖ్యంగా రైతు పండించిన పంటకు మంచి ధర వచ్చేలా చూడాలి. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తే  మార్పు రాదు.  ప్రభుత్వం మొత్తం పంటను కొనుగోలు చేయాలి.  నిజానికి  రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెబుతుందని, ఆ పంటలకు మద్దతు ధర కూడా ఇస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ అది మాటల రూపంలో కాకుండా  చేతల రూపంలో అయితే నిజంగా  రైతుల బతుకులు మారతాయి.   
 
 
రైతులు కూడా ప్రభుత్వం చెప్పిన పంటనే వేయాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడం. మార్కెట్ డిమాండుకు తగ్గట్లు పంటలు పండిస్తేనే రైతుకు లాభం. అలా కాకుండా ఏది పడితే అది పండించి,  పండిన పంటలు మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అందుకే  అమ్ముడుపోయే సరుకే పండించాలి.