ఆంధ్రా హాట్ న్యూస్: సీమ బైరెడ్డి చూపు ఎటువైపు..?

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజనకు మందు టిడిపి నుంచి బయటికి వచ్చి రాయలసీయ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్పీఎస్ ను మూసేశారు. ప్రస్తుతం ఏ పార్టీకి వెళ్లకుండా నిశ్శబ్దంగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ చూపు ఇప్పుడు బైరెడ్డి పై పడినట్టు తెలుస్తోంది. ఏపీలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోయడానికి అధిష్టానం భారీ ప్రయత్నాలే చేస్తుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కూడా కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపిందని నేతలు అంటున్నారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంది కొట్కూరు నియోజక వర్గం నుంచి 1994, 1999 ఎన్నికలలో టిడిపి తరపున పోటి చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. 2009లో నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వు అయ్యింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు పరిధిలో ఉన్న ఓర్వకల్లు మండలం పాణ్యం నియోజకవర్గానికి మారింది. దీంతో బైరెడ్డి 2009లో పాణ్యం నియోజక వర్గం నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఆ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బైరెడ్డి సెప్టెంబర్ 2012లో టిడిపిని వీడి రాయలసీయ పరిరక్షణ సమితిని  ఏర్పాటు చేశారు. అలా పత్యేక సీమ కావాలని, రాయల తెలంగాణ అయినా ఇవ్వాలని బస్సుయాత్రలు, పాదయాత్రలు చేశారు. భారీ సభలు ఏర్పాటు చేశారు. 2013 సెప్టెంబర్ 5 న ఆర్పీఎస్‌ను రాజకీయ  పార్టీగా బైరెడ్డి ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటి చేయకుండా తన కూతురు బైరెడ్డి శబరిని ఆర్పీఎస్ తరపున పాణ్యం నియోజకవర్గం నుంచి పోటికి నిలిపారు. ఆమె ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. అయినా బైరెడ్డి తన సీమ నినాదాన్ని ఎత్తుకుని ముందుకు సాగారు.

నంద్యాల ఉపఎన్నికల తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాను ఏర్పాటు చేసిన రాయలసీమ  పరిరక్షణ సమితిని సెప్టెంబర్ 06,2017న మచ్చుమర్రు వేదికగా దానిని మూసివేశారు. ఆయన టిడిపిలో చేరుతారన్న  వార్తలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత ఆయన 28 డిసెంబర్ 2017 న సీఎం చంద్రబాబుతో సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఆయన  టిడిపిలో చేరిక ఇక ఖాయమే అని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో బైరెడ్డి ఇప్పటివరకు నిశ్శబ్దంగానే ఉన్నారు. నందికొట్కూరులో ప్రధాన ప్రత్యర్ది మాండ్ర శివారెడ్డి వర్గం ఆయనను టిడిపిలోకి రాకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ ఊమెన్ చాందీ బైరెడ్డి తో చర్చలు జరిపారని తెలుస్తోంది. బైరెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు లేనిచో రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారట. బైరెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. దేశం లో మోదీ హవా తగ్గి రాహుల్ హవా కొనసాగుతుందని బైరెడ్డి సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. దీంతో బైరెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక వేళ బైరెడ్డి కాంగ్రెస్  లో చేరినా ఆశ్చర్యం అవసరం లేదు ఎందుకంటే బైరెడ్డి నాన్నశేషశయనారెడ్డి కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో బైరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ తో కూడా  సంబంధాలున్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా రాజకీయంలో ఆయన  పాత్ర కీలకం కానుంది. ఆయన చూపు ఏ పార్టీ వైపో అన్న చర్చ  ఇప్పుడు అందరిలో జరుగుతుంది.