ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు బిజెపి, జనసేన పార్టీలు సంయుక్తంగా వెళ్లి వారికి అండగా నిలవాలని ఉభయ పార్టీలు సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రైతులకు భరోసా కల్పించాలని, అమరావతి రాజధాని విషయంలో రెండు పార్టీలు పోరాటం చేయాలనీ సంకల్పించినట్టు తెలిసింది. విజయవాడ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దగ్గుబాటి పురందరేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి, హాజరవ్వగా జనసేన ప్రతి పక్షాన నాదెండ్ల మనోహర్, శివశంకర్, తదితరులు హాజరయ్యారు. రాజధాని మార్పు, స్థానిక సంస్థల ఎన్నికలను సన్నద్ధం కావడం పై చాలా సేపు చర్చలు జరిపారు.
అమరావతి ప్రస్తుత దుస్థితికి కారణం నాడు టిడిపి అని నేడు వై సిపి అంటూ ఈ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నట్టు వైసిపి పార్టీ అభూత కల్పనలు చెబుతుందని అన్నారు. బిజెపి, జనసేన రేండు పార్టీలు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాయని, ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అమరావతి పర్యటన గురించి తెలియచేస్తామని చెప్పారు.