రాజధానికి డబ్బు లేదు.. అందుకే సైలెంట్ షిఫ్టింగ్ 

వైఎస్ జగన్ అనుకున్నది చేసే వరకు నిద్రపోరు.  అయన పట్టుదల గురించి అందరికీ తెలుసు.  మూడు రాజధానుల విషయంలో కూడా ఆయన అదే పట్టుదలతో ఉన్నారు.  ఎవరెన్ని విమర్శలు చేసినా, అమరావతి రైతులు 200 రోజులకు పైబడి నిరసన తెలుపుతున్నా సీఎం ఆలోచన మారేట్టు కనబడటం లేదు.  ఇంతకు ముందు బొత్స సత్యనారాయణ ఆమరావతి భవనాల పరిశీలన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇపుడప్పడే రాజధాని గురించి ఏమీ చెప్పలేమని అనడం చూసి ముఖ్యమంత్రి మనసు మారుతుందేమో అనుకున్నారు.  
 
కానీ అవన్నీ భ్రమేనని తేలిపోయింది.  సీఎం కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను సిద్దం చేసే పనిలో ఉన్నారట.  అది కూడా సైలెంట్ గా.  మెల్లగా ప్రధాన విభాగాలన్నింటినీ విశాఖకు మళ్లిస్తున్నారట.  ఈ ప్రాసెస్ అంతా నిదానంగా, ఎలాంటి హడావిడి లేకుండా జరగాలనేది నిర్ణయమట.  ఎందుకంటే ఒకేసారి మారిస్తే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది.  ఆమరావతి రైతుల నుండి ప్రతిపక్షం టీడీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర కార్మిక సంఘాల నుండి నిరసన వచ్చే అవకాశం ఉంది.  అందుకే హడావుడి లేకుండా పని కానిచ్చేస్తారట. 
 
ఈ సైలెంట్ తరలింపుకు మరొక ముఖ్య కారణం ఉంది.  అదే నిధుల లోటు.  కొంత కట్టిన అమరావతిని కాదని జగన్ విశాఖకు రాజధానిని మారుస్తున్నారు అంటే విశాఖ వాసులు, మూడు రాజధానుల మద్దతుదారులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకుంటారు.  ఒక్కసారిగా వైజాగ్ రూపురేఖలు మారిపోతాయని అనుకుంటారు.  కానీ అవన్నీ చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు.  ఉన్నవన్నీ సంక్షేమ పథకాల కోసమే ఖర్చైపోయాయి.  ఇక మీదట చేయబోయే కార్యక్రమాలకు నిధులను సమకూర్చుకోవడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సిన పరిస్తితి.  అలాంటిది రాజధాని కోసం ప్రత్యేకంగా డబ్బు అంటే మళ్లీ అప్పులే తేవాలి.  అందుకే హంగూ, ఆర్భాటం లేకుండా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సిద్దం చేస్తున్నారట.