ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తుంది. రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి ఇప్పుడు ప్రజల్లో లేని పోనీ చీలికలు తెస్తున్నారని టీడీపీ ఎం ఎల్ ఏ, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. మూడు రాజధానుల విషయంలో మొదటి సారి స్పందించిన అయన పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఒక వెలుగు వెలిగిన తెలుగు చరిత్ర ఇప్పుడు ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. త్వరలోనే జనాల్లో విప్లవం వస్తుందని అన్నారు. తాజాగా బాలయ్య అనంతపురం జిల్లా లోని హిందూపూర్ ని సందర్శించారు. ఈ సందర్బంగా అయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ .. పొరుగురాష్ట్రాల స్థాయికి చేరుకోవాలంటే హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నై కి ధీటుగా అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆర్ధిక రాజధాని విశాఖ అని ఎప్పుడు అంటూనే ఉన్నామని బాలయ్య తెలిపారు. శాశన సభ, కార్య నిర్వాహక శాఖలు ఎక్కడైనా ఒకచోట ఉండాలని అయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కర్నూల్ నుండి విశాఖ వెళ్లాలంటే ఎంతో దూరం అవుతుందని చెప్పారు. రాష్ట్రానికి కియా లాంటి అనుబంధ సంస్థలు రావాల్సింది పోయి వచ్చినవి వెనక్కి పోతున్నాయని అన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే కొత్త పరిశ్రమలు రావని , దాంతో పాటు అభివృద్ధి కుంటుపడుతున్నదని చెప్పారు బాలయ్య. హిందూ పురంలో వైకాపా కార్యకర్తలు తన కాన్వాయ్ ని అడ్డుకుని కొత్త సంస్కృతికి తెర లేపారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు.