ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి తిరిగి అమరావతి చేరుకున్నారు. ఈ పర్యటనపై ఎవరికి తోచిన నిర్ణయాలకు వారు వచ్చారు. కాకి “కా కా” అని అరచినట్లే టిడిపి నేతలు తమకు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.వారు వేరు విధంగా మాట్లాడతారని ఎవ్వరూ ఊహించ లేరు. మూడు రాజధానులకు కేంద్రం నుండి సానుకూలత రాలేదని టిడిపి నేతలు చెబుతున్నారు.అదే సమయంలో బిజెపి జాతీయ కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ఇన్ చార్జి దేవధర్ మాట్లాడుతూ వైసిపితో తమకు ఎట్టి పొత్తు లేదని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ పార్టీ విధానం అంటూనే అసలు విషయం బయట పెట్టాడు. రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో వుంటుందని ఇందులో కేంద్రం బాధ్యత ఏమీ లేదన్నారు.ఇది అక్షరాలా వాస్తవం.

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఫలితాల గురించి అంచనాకు రావడానికి ఈ ఒక్క అంశం చాలు. మూడు రాజధానులు రాష్ట్ర ప్రజలకు అనుకూలమా? ప్రతి కూలమా? అనే అంశాలు పక్కన బెడితే రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని తేలి పోయింది.ఆ దృష్ట్యా చూచినపుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విఫలమైనదని చెప్పడానికి ఎట్టి ప్రాతిపదిక లేదు. కాకుంటే తను అమలు చేయదలచిన విధానాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నివేదించాలి. కాబట్టి రెండు మూడు రోజులు ఢిల్లీలో గడపవలసి వచ్చింది.తను అమలు చేయదలచిన విధానాలు వారికి వివరించడంలో ఎంతవరకు విజయవంతం అయ్యాడో కొలిచేందుకు ఎవ్వరి వద్ద కొలబద్ద లేదు.

రాష్ట్ర మంత్రులు కొందరు చెబుతున్నట్లు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని చెప్పడం సబబు కాదు గాని రాజధాని మార్పుకు అడ్డంకులు వుంటే న్యాయ సంబంధంగా ఏవైనా వుండ వచ్చు.అందుకు కొన్ని నియమ నిబంధనలు వుండ వచ్చు. అయితే హైకోర్టు బెంచీలు ఎన్నైనా నెలకొల్పుకోవచ్చు గాని ప్రిన్సిపల్ కోర్టు తరలింపు ఒక పెద్ద ప్రక్రియ. దాని కోసమే ముఖ్యమంత్రి న్యాయ శాఖ మంత్రిని కలవ వలసి వచ్చింది. ఈ సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ముఖ్యమంత్రి ప్రదాన మంత్రితోనూ హోంమంత్రితోనూ జరిపిన చర్చలు విఫలం అయ్యాయని చెప్పే వాదనకు ఎట్టి ప్రాతిపదిక లేదు. ఇదంతా రాజకీయ దురుద్దేశాలతో చేసిన ప్రకటనలుగా భావించాలి. ఇద్దరు వివిఐపి మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు గురించి అమరావతిలో వుండి మాట్లాడటమంటే అంతా భోగస్ గా ఎంచాలి.