ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పార్టీపై అదుపు తప్పుతోందా?

ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత పరిపాలన రంగంలో ఛండశాసనుడుగా ప్రసిద్ధి కెక్కారు. ప్రతి పక్షాల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించుతున్నారు. ఆందోళన చేస్తున్న రాజధాని మహిళల పట్ల కూడా మెతక వైఖరి అవలంభించడంలేదు. ప్రభుత్వపరంగా తీసుకుంటున్న అన్నినిర్ణయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలుగా భావిస్తున్నారు. వివాదాస్పదంగా తయారైన మూడు రాజధానులు శాసనమండలి రద్దు ఇలాంటి వన్నీ ముందు వెనుక చూడకుండా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలుగా ప్రచారంలో వున్నాయి. ఎవరు చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోరని తనకు నిర్ణయం అనిపిస్తే కఠినంగా అమలు చేస్తున్నారనే ప్రచారమూ వుంది.

అయితే పార్టీ పరంగా ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.. అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలోనే కొన్ని జిల్లాల్లో ముఠా తగాదాలు ముంచు కొచ్చాయి. వీటిని అదుపు చేయడంలో విఫలమౌతున్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. ఏ మాటకామాట చెప్పుకోవాలి. ప్రతి పక్షంలో వున్నపుడు నియోజకవర్గ ఇన్ చార్జిలను నిర్థాక్ఖిణ్యంగా మార్చి వేసిన సందర్భాలున్నాయి. కాని అధికార పీఠం అధిష్టించిన తర్వాత పార్టీ ప్రతిష్ట దెబ్బ తినేవిధంగా సంఘటనలు సంభవిస్తున్నా ముఖ్యమంత్రి నేరుగా పిలిచి హెచ్చరికలు జారీ చేసిన సందర్భం లేదు.

ఇందులో రెండు రకాలున్నాయి. పార్టీ నేతలు ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించినందున పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడం- రెండు పార్టీ నేతలు పరస్పరం గొడవలు పడటం. వైసిపి అధికారం చేపట్టిన తొలి నాళ్ళలో నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి రెండువ తరహా గొడవలకు కేంద్ర బిందువైనారు. ముఖ్యమంత్రి కాకుండా కింది స్థాయి నేతలు పిలిచి మాట్లాడి తెరదించారు. రాజకీయాల్లో సీనియర్ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుండి భహిష్కరిస్తారనే ప్రచారం జరిగింది కాని తర్వాత సద్దుమణిగింది.

ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఒకటి రెండు చోట్ల ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో ఘర్షణ పడి మీడియాకెక్కారు. కర్నూలు నందికొట్కురు నియోజకవర్గాల్లో ముఠా తగాదాలు బయట పడ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలో మరీ చెప్పులతో దాడులు చేశారు. అదీ మంత్రుల సమక్షంలో జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆమోదంతోనే టిడిపి నేత వైసిపిలో చేరారు. కాని స్థానిక ఎమ్మెల్యే వర్గం రెచ్చిపోయింది. తాజాగా గుంటూరు జిల్లాలో చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజని వర్గానికి నర్సారావు పేట పార్లమెంటు సభ్యులు కృష్ణ దేవరాయలు వర్గాలు పరస్పరం దాడులు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది.

అదుపు తప్పిన వారిని తొలుతనే ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించి హెచ్చరికలు చేసి వుంటే ఒక దాని వెంబడి మరొకటి సంభవించి వుండేవి కావు.ఒక వేళ ముఖ్యమంత్రి ఆదేశంగా కింద స్థాయి నేతలు ఇచ్చే హెచ్చరికలు పనిచేయడం లేదా? పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యేలు కాక ముందు భయం భక్తులతో వుండి . పదవి చేజిక్కిన తర్వాత క్రమశిక్షణ తప్పుతున్నారా?
.
ఇంతలోనే ఈ విధంగా ముఠా తగాదాలకు పాల్పడితే మున్ముందు ఇవి ఇంకా పెచ్చు రేగిపోయే ప్రమాదముంది .అందర్నీ ఆశ్చర్యపర్చే అంశమేమంటే పరిపాలన పరంగా కఠిన నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి పార్టీ పరంగా ఎమ్మెల్యేలను అదుపు చేయడంలో ఎందుకు విఫలమౌతున్నారో రాజకీయ విశ్లేషకులకు అంతుబట్టడం లేదు.