ముఖ్యమంత్రి అమిత్ షా బేటీపై ఉత్కంఠ!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఢిల్లీకి శుక్రవారం సాయంకాలం వెళుతున్నారు. బుధవారం ప్రధానితో జరిపిన చర్చలు కొనసాగింపుగా హోంమంత్రి అమిత్ షా తో చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చేపట్టిన విధానాలకు రేపు హోం మంత్రితో జరిగే చర్చలు ఆలంబనగా వుండనున్నాయి. హోంమంత్రి నుండి గ్రీన్ సిగ్నల్ లభించితే ముఖ్యమంత్రి రొట్టె విరిగి నేతిలో పడినట్లే. ఎంత త్వరగా శాసన మండలి రద్దు అవుతుందో దాన్ని బట్టి రాష్ట్రంలో అడ్డంకులు తొలగ నున్నాయి.

తొలుత మూడు రాజధానుల ప్రతి పాదనతో అనిశ్చితి ఏర్పడి వుండగా శాసన సభ ఆమోదించిన రెండు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో మండలి రద్దు చేయ వలసి వచ్చింది. ఇదెలా వుందంటే కొని తెచ్చుకొన్న రెండవ చిక్కుగా మిగిలింది. ఈ అనిశ్చితి స్థితి నుండి త్వరగా బయట పడాలంటే కేంద్రం సాయం తప్పని సరి.

ఈ పూర్వ రంగంలోనో హఠాత్తుగా బుధవారం ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని కలిశారు. వీరి బేటీపై భిన్న కథనాలు వెలువడినా ప్రధాన మంత్రి నుండి ఊరట కలిగే సానుకూలత లభ్యమైనట్లుంది. ఫలితంగానే గురువారం ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ చేత ప్రకటన చేయించారు. ఒక దశలో మార్చి 15 నుండి శాసన సభ సమావేశాలు వుంటాయని లీకులు వెలువడినా అందుకు భిన్నంగా ఉభయ సభలు ప్రొరోగ్ చేయ బడ్డాయి. ఇక పెండింగ్ లో వున్న బిల్లులపై ఆర్దినెన్స్ జారీ చేసి అవి అమలుకు ముందుకు పోతారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. తర్వాత ఆరు నెలల లోపు చట్ట బద్దత కలగ వలసి వుంది. అప్పటికి శాసన మండలి రద్దు జరుగు తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం శాసన మండలిలో పెండింగ్ లో బిల్లులు వుండగా ఆర్దినెన్స్ తీసుకు రావడంపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. దీనిపై ఎవరి భాష్యాలు వారు చెప్పుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బేటీ అయ్యేందుకు శుక్రవారం ఢిల్లీ వెళ్లుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర నుండి పూర్తి హామీ లభించితే ఆర్దినెన్స్ జారీ చేస్తారని తెలిసింది. శుక్రవారం వీరిద్దరి మధ్య జరిగే బేటీతో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు తుది దశకు చేరుకుంటాయని వైసిపి వర్గాలు విశ్వసిస్తున్నాయి.