మారడు కాక మారడు..సొంత డబ్బా ఎక్కువైపోయిందా ?

కొందరంతే తమ మైండ్ సెట్ మార్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. అటువంటి వారిలో చంద్రబాబునాయుడు ముందు వరసలో ఉంటారు. తాజాగా ఖమ్మం, కొత్తగూడెం భద్రద్రి జిల్లాల నేతలతో భేటి అయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా తన వల్లే అభివృద్ధి జరిగిందన్నారు. ఈరోజు ప్రభుత్వ అందుకుంటున్న ఆదాయమంతా కేవలం తన గొప్పతనం వల్లే అన్నట్లుగా చెప్పారు.

తనకు ముందు చూపు ఎక్కువ కాబట్టే హైదరాబాద్ ను అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్ళినట్లు చెప్పారు. నిజానికి అప్పట్లో చంద్రబాబు చేసిన పని వల్లే ఇపుడు యావత్ ఏపి నష్టపోయింది. అప్పట్లోనే మొత్తం అభివృద్ధిని హైదరాబాద్ చుట్టు పక్కలే చేసుండకపోతే ఏపి ఇపుడు ఇంత దీనస్ధితిలో ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్ధలను, ఐటి సంస్ధలను ముందు చూపు లేకుండా హైదరాబాద్ చుట్టు పక్కలే పెట్టారు చంద్రబాబు.

తాను ఏది చేసినా సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసమే అంటూ కథలు వినిపించారు. పోలవరం, రాజధాని నిర్మాణం ముసుగులో వేల కోట్ల రూపయాల భారీ అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్ తో అస్మదీయులకు వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందలాది ఎకరాల భూములను కట్టబెట్టటమేనా చంద్రబాబుకున్న ముందు చూపు, సమాజ హితం ?  ప్రజలకు మంచి చేయబట్టే ఎన్టీయార్ ను తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారట. ఈ ఒక్క విషయం మాత్రమే చంద్రబాబు నిజం చెప్పారు.

జనాలు మాత్రం ఎన్టీయార్ ను గుండెల్లో పెట్టుకుంటే తాను మాత్రం అదే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి సిఎం కుర్చీని లాక్కున్నారు. ఎన్టీయార్ హయాంలో తెలుగు ప్రజలు టిడిపిని గుండెల్లో పెట్టుకుంటే మరి తెలంగాణాలో చంద్రబాబు నాయకత్వంలోని టిడిపిని ఎందుకు చీ కొట్టి తరిమేశారు ?  ఎక్కడైనా మంచి జరిగితే తన ఖాతాలోను, తప్పు జరిగితే ఎదుటి వాళ్ళకు ఆపాదించటమనే నైజం చంద్రబాబును ఎప్పటికి వదలదని అర్ధమైపోతోంది.