కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచమే అల్లాడిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ని నివారణ చర్యలు తీసుకుంటున్న కరోనా కంట్రోల్ కాక ప్రజల జీవితం సాఫీగా సాగని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కరోనాకి తోడు తెలుగు రాష్ట్రాలకు మిడతల రూపంలో మరో కొత్త సమస్య వచ్చి చేరబోతుంది. కనబడ్డ పంటను హరించి వేసే ఈ మిడతల దండు ఎక్కడో ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరి దేశాలు, సముద్రాలు దాటుకొని మన తెలుగు రాష్ట్రాల వైపు రావడం ఏమిటి ? విచిత్రం కాకపోతే. అయితే, మన ప్రభుత్వాలు ఈ మిడతలను సీరియస్ గా తీసుకున్నట్టు లేవు. వీటి ప్రవాహం ప్రభావం తెలియాలంటే పాకిస్తాన్ మీద ఇవి చేసిన దాడి గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ లక్షలాది ఎకరాల పంటను ఇవి హరించివేసాయి.
పాకిస్తాన్ నుంచి ఈ మిడతలు ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్ , గుజరాత్, పంజాబ్ లోని పంటల పై దాడులు చేశాయి. ఆ దాడుల దెబ్బకు ఆయా రాష్ట్రాల్లో వందలాది ఎకరాల పంటలు నాశనం అయ్యాయి. మధ్యప్రదేశ్ లోని పంటల పై ఇప్పటికే మిడతలు దాడులు చేస్తూనే ఉన్నాయట. ప్రభుత్వమే ఆదుకోవాలని మిడతల నుంచి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఈ మిడతల దండు ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల వైపు వస్తూ ఉన్నాయి. జూలై నెలలో ఈ మిడతల దండు తెలుగు రాష్ట్రాల పై పూర్తీ స్థాయిలో దాడి చేసే అవకాశం ఉంది. ఈ మిడతల దండు తెలుగు రాష్ట్రాలపై దాడులు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఈ మిడతల దండు ఎటాక్ చేయకుండా ముందుగానే పంటలను రక్షించుకోవడానికి మన ప్రభుత్వాలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఒక చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మిలియన్ కు పైగా మిడతలు దాడులు చేస్తాయి. మిలియన్ మిడతలు ఒక్క రోజులో 35 వేలమంది తినే ఆహారాన్ని తినేస్తాయట. వామ్మో.. ఈ లెక్కన వీటి దాడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే మన తెలుగు రాష్ట్రాలు ముందుగానే మేల్కోవాలి.