బాబును, చిన్నబాబును జడిపిస్తున్న సోషల్ మీడియా

(టి.రమేశ్ బాబు*)

డిజిటల్ యుగంలో కాకలు తీరిన మేధావులైనా సరే నోరు జారితే సరిదిద్దుకోవడం జరిగే పని కాదు. ఒకరు ఒకసారి నోరుజారి ఒకరికంటపడినా అది దావానలమవుతుంది. ఇదే పార్టీలో రొటీన్ అయితే, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది అనేకసార్లు నోరుజారి జనానికి దొరికిపోతే దాని డ్యామేజీ ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఏం మాట్లాడాలో తెలియని నారా లోకేశ్ మొదలుకొని ఏదో ఒకటి మాట్లాడాలనుకునే సీనియర్ నేతల వరకు చేస్తున్న కామెంట్లు చంద్రబాబును, ఆయన పార్టీ పరివారాన్ని నవ్వుల పాల్జేస్తున్నాయి. వివిధ సందర్భాల్లో లోకేశ్ చేసిన కామెంట్లను ఓసారి గుర్తు చేసుకుందాం. 1) రాష్ట్రంలో కులపిచ్చి, మత పిచ్చి, ఆ పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. ఔనా కాదా? 2) వచ్చే మూడేళ్లలో ప్రతి ఒక పల్లెలో మంచినీళ్లు లేని ఇబ్బంది తీసుకొస్తాను. 3) ఈవీఎం మిషన్లలో సైకిల్ గుర్తు రిపేర్ కొచ్చే విధంగా గుద్దీ.. గుద్దీ… గుద్దీ… మళ్లీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబునే గెలిపించాలి. 4) రాష్ట్రంలో 200 స్థానాల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నాను(వుండేవి 175). 5) సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్టు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి కామెంట్లను ప్రధాన మీడియా పట్టించుకోకపోవచ్చు. ఇలాంటివి సోషల్ మీడియాను కనుగప్పి మాయంకాలేవు. వీటి మీద  కామెంట్లు రాయకుండా, షేర్ చేయకుండా ఎవరైనా ఉండడం సాధ్యమేనా?

 

సౌమ్యుడిగా పేరున్న మురళీమోహన్ సైతం ఇలాంటి పనే చేశారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరిగా పేర్కొంటూ కమ్మవారిలో కలిపేసుకొని విమర్శలపాలయ్యారు. ఆ తరువాత క్షమాపణ చెప్పుకున్నారు. ఇటీవల కడప ఉక్కు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిరాహార దీక్ష చేస్తున్నపుడు ఢిల్లీలో.. తనకు బరువుతగ్గాలని ఉందని, పార్టీ అనుమతిస్తే ఐదు రోజులు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నానన్న మాటలు… కడప ఉక్కు మీద వారి చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తున్నాయి.

 

ఇక అందరి కన్నా ఘనుడు చంద్రబాబు సైతం ఈ విషయంలో రికార్డులే సృష్టించారని చెప్పాలి. ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీలో దీక్షలు చేయిస్తున్న చంద్రబాబు.. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ ఆఫీసర్ చేత కేంద్రానికి రాయించిన లేఖలో… తమకు రావాల్సిన ప్యాకేజీ మొత్తాన్ని త్వరగా పంపాలని, అందుకయ్యే వడ్డీని కూడా కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం మీద పోరాడుతున్నట్టు కలరిస్తున్న బాబు.. ఈ లేఖ బయటకు రావడంతో కంగు తినాల్సి వచ్చింది. మరో సందర్భంలో భారతదేశం మొత్తాన్ని చూస్తే అవీనితిలో గానీ, అభివృద్ధిలో గానీ మొదటి స్థానంలో మనమే ఉన్నామని నిండుసభలోనే తడబడ్డారు. ఆ తరువాత వివరణ ఇచ్చుకున్నారు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. తన స్ఫూర్తితోనే ఆ స్థాయికి వచ్చాడంటూ అతిశయోక్తులకు పోయి నవ్వులపాలయ్యారు. తొలుత డీమోనిటైజేషన్ సలహా తానే ఇచ్చానన్న బాబు.. మోడీతో వ్యవహారం చెడిపోయాక విమర్శలకు దిగి అభాసుపాలయ్యారు.

 

ఇక సీఎం రమేశ్ పాల్గొన్న ఉక్కు దీక్షను  ఆంధ్ర రాష్ట్రం  కోసం తుదకంటా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో పోల్చి దారుణంగా భంగపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్’ మీద కేంద్రం నుంచి ప్రకటన రాగానే పొట్టి శ్రీరాములు దీక్ష విరమించారని, అలాగే సీఎం రమేశ్ కూడా కేంద్రం నుంచి ప్రకటన రాగానే విరమిస్తున్నారంటూ పిచ్చిమొక్కను, తులసిమొక్కను ఒకే గాటన కట్టే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు. మరో సందర్భంలో భారతదేశం మొత్తాన్ని చూస్తే అవీనితిలో గానీ, అభివృద్ధిలో గానీ మొదటి స్థానంలో మనమే ఉన్నామని నిండుసభలోనే తడబడ్డారు. ఆ తరువాత వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈ కామెంట్లు వేటిని కూడా పేరున్న ప్రధాన మీడియా పట్టించుకోలేదు. సోషల్ మీడియా విజృంభణ వల్లే వాటికి ప్రాచుర్యం లభించింది.

పెద్ద పత్రికలు, పెద్ద చానళ్లు చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవు. దేన్ని పెద్దదిగా చూడాలి లేదా చూపాలి? దేన్ని చిన్న ఇష్యూగా భావించాలి లేదా భ్రమింపజేయాలి? అనే అంశంలో ఒక్కో మీడియా సంస్థకు ఒక్కో రకమైన ‘స్టైల్ షీట్’ ఉంటుంది. వాటి ‘స్టైల్’ను బట్టే కవరేజీ ఇస్తారు. కవరేజీకి తగినట్టు వివిధ రూపాల్లో ‘కవర్లు’ ముట్టజెప్పుకోవడం వేరే సంగతి. ఇదీ ప్రధాన స్రవంతి మీడియాలో అమలవుతున్న ఓ సంప్రదాయం. అందుకే దీన్ని సంప్రదాయ మీడియా అన్నారు మన పెద్దలు. అందుకు పూర్తి భిన్నంగా ఏ పెద్ద కంటికీ కనిపించని అతి చిన్న మీడియా సంస్థలు ‘పెట్టు గొడుగుల్లా’ తయారై ప్రత్యక్ష ప్రసారాల (లైవ్ టెలికాస్ట్) నుంచి పాక్షిక ప్రత్యక్ష ప్రసారాల (మాక్ లైవ్స్) దాకా వారి ‘విజన్’ ను బట్టి వార్తలకు కవరేజీ కల్పిస్తున్నాయి. సాధారణ పౌరుడయినా స్మార్ట్ ఫోన్ జేబులో మీడియా సంస్థకు ఓనరైనట్టే లెక్క. అరచేతిలో అద్భుతాలు సృష్టించే ఇలాంటి సోషల్ మీడియా సంస్థలకు ఎవడికి వాడే రామోజీరావు. దమ్ము చూపాలన్నా, దుమ్ము రేపాలన్నా కాస్త బుర్ర ఉంటే చాలు. ప్రధాన స్రవంతి మీడియా ‘చూసీ చూడనట్టు’ వదిలేసిన సోషల్ మీడియా ఫాలోవర్ వార్తా వజ్రాలను ఏరుకుంటాడు. మనసుకు తోచింది రాసుకుంటాడు. నచ్చినవారితో ‘షేర్’ చేసుకుంటాడు. ఇక ఆ అస్త్రాన్ని ఆపడం, మార్చడం, ఏమార్చడం, దారి మళ్లించడం అసంభవం. భారీ సంస్థలనైనా తన కనుసన్నల్లో ఉంచుకోగలిగిన చంద్రబాబు.. ఇలాంటి సూక్ష్మ, అతిసూక్ష్మ సంస్థలకు బెదిరిపోతుండడం విచిత్రమే. అపరిపక్వత కారణంగా ఒక సింగిల్ లీడర్ చేసే డ్యామేజీ కన్నా.. సోషల్ మీడియాతో జరిగే డ్యామేజీ వేల రెట్లు అధికంగా ఉంటోందని ఆందోళన చెందుతున్నారు. అయితే సోషల్ మీడియాను అదుపులో ఉంచే ఆలోచన కన్నా.. తమ నోటిని అదుపులో ఉంచుకుంటే పరిష్కారం దొరికినట్లే కదా. మరి ఈ ఆలోచన చంద్రబాబుకు ఎందుకు కలగడం లేదనేది ఎవరికీ అర్థం కాని పాయింటు.