సీనియర్ ఎన్టీఆర్ తెలుగునాట తిరుగులేని ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆయన మూడో తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో దూసుకెళ్తున్నారు. మరి రాజకీయాల్లో..? టీడీపీకి భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆరే అని ఎప్పటినుండో తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ అనుకూల పరులు కూడా అనుకుంటున్నారు. కానీ, టీడీపీ నాయకుల్లో మాత్రం ‘జూనియర్’ అంటే ఇంకా ఎక్కడో చిన్న చూపే. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్నా కూడా బాబు ఆలోచనలు ఇంకా లోకేష్ మీదే ఉన్నాయి. కానీ లోకేష్ నాయకుడిగా నిలబడటం అంటే సాధ్యమేనా ? బాబుకు కూడా నమ్మకం ఉందని అనుకోలేం.
అందుకే ఆంధ్రప్రదేశ్ లో త్వరగా పార్టీని బలోపేతం చేయాలనీ చంద్రబాబు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నా.. జగన్ ప్రభంజనంలో చంద్రబాబు ప్రణాళికలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయనేది వాస్తవం, కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని, భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అప్పగించాలనే చర్చ టీడీపీ సమావేశాల్లో ఎప్పటినుండో జరుగుతుంది. అయినప్పటికీ ఈ విషయం మీద చంద్రబాబు బహిరంగంగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఎంతమేరకు కూడా లేదని పార్టీ నాయకుల చేత అనిపించాడు బాబు.
బాబు పుత్ర వాత్సల్యం అలాంటిది మరి, కానీ బాబుగారు ఒక్కటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని తన తరువాత సమర్ధవంతమైన వ్యక్తి చేతిలో పెడితేనే.. టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే.. అనేక పార్టీల కాల గర్భంలో కలిసిపోయినట్టే టీడీపీ కలిసిపోవొచ్చు. ఇప్పటికే టీడీపీని పెద్ద ఎత్తున దెబ్బ తియ్యటానికి ప్రయత్నం జరుగుతుంది. మరో పక్క బాబు పై వైసీపీ నాయకులూ తీవ్ర స్థాయిలో అత్యంత పరుషజాలంతో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లకు భవిష్యత్తు పై ఆశ కల్పించాల్సిన కనీస బాధ్యత కూడా బాబు పైనే ఉంది. బాబుగోరు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి.