వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విడతల వారీగా విస్మరిస్తూ వచ్చారు. ఎలక్షన్లకు ముందు మొత్తం ఎంపీ సీట్లలో తమనే గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి మరీ హోదా తీసుకొస్తానన్నారు జగన్. దీంతో జనం 25 కి 25 కాకపోయినా 22 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించారు. కానీ వైసీపీ మాత్రం జనం ఏదో మాట తప్పినట్టు హోదా అంశాన్ని మరుగునపడేశారు. ఎప్పుడు హోదా ప్రస్తావన తేవాల్సి వచ్చినా దాటవేస్తూనే ఉన్నారు. మొన్నామధ్య సీఎం కేంద్రానికి మన అవసరం వచ్చినప్పుడు హోదా సంగతి తేలుస్తానని అన్నారు. ఆ మాటలతోనే జనంలో హోదా మీద ఆశలు సగం ఆవిరైపోయాయి.
ఇక తాజాగా జరిగిన వార్షిక బడ్జెట్ సమావేశాల్లో మొహమాటానికి కూడా అధికార పక్షం హోదా గురించి మాట్లాడలేదు. గౌరవనీయ గవర్నర్ ప్రభుత్వం తరపున తన ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని విశేషంగా ప్రస్తవించారు కానీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును గురించి అస్సలు మాట్లాడలేదు. గత బడ్జెట్ ప్రకటనలో కనీసం హోదా తెస్తామనే మాటైనా మాట్లాడిన అధికార పక్షం ఈసారి ఆ ఊసే ఎత్తలేదు. హోదా తేవడం తేకపోవడం తర్వాత సంగతి కనీసం ఇచ్చిన హామీకైనా కట్టుబడి ఉన్నామని జనానికి చెప్పే ప్రయత్నం చేయలేదు.
దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని హోదా పేరుతో ఇబ్బంది పెట్టకూడదని జగన్ సర్కార్ గట్టిగా సంకల్పించుకున్నట్టు అర్థమవుతోంది. గతంలో ఇదే వైసీపీ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రజల్లో హోదా సాధించే సత్తా, చిత్తశుద్ధి తమకు మాత్రమే ఉన్నాయని పెద్ద కలరింగ్ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచిందో లేదో అసలు తాము హామీనే ఇవ్వలేదన్న తరహాలో కీలకమైన బడ్జెట్ ప్రసంగాల్లో హోదా ప్రస్తావనను కావాలనే పక్కనపెట్టేసింది. దీంతో జనం హోదా పట్ల మీ చిత్తశుద్ధి ఇంతేనా జగన్‌గారు అని ప్రశ్నిస్తున్నారు.