సర్జరీకి వ్యతిరేకం అంటున్న పవన్
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆ వెన్నునొప్పి పెరిగిపోవటంతో డాక్టర్లను కలిశారు. అయితే, డాక్టర్లు పరీక్షించి.. సమస్య పెరగక ముందే సర్జరీ చేయాలని సూచించారట. కాగా, సర్జరీపై రెండు మూడు రోజులపాటు ఆలోచించిన పవన్ కళ్యాణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ను కంగారుపెడుతోంది.
వెన్నుపూస సర్జరీ అనేది రిస్క్ తో కూడికున్నదని, కాబట్టి ఆపరేషన్ చేయించుకోకూడదని, నేచర్ క్యూర్ పద్దతిలోనే వెన్నునొప్పిని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. కొంతకాలం పాటు పార్టీ పనులను పక్కన పెట్టి నేచర్ క్యూర్ పద్దతిలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. అయితే పవన్ ఆపరేషన్ చేయించుకోవటం బెస్ట్ అని, నేచర్ క్యూర్ పద్దతిలో సమస్య ఎంతవరకూ తీరుతుందని, మళ్లీ తిరిగబెడితే అప్పుడు సర్జరీకి వెళ్లల్సి వస్తుంది కదా అని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు పవన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. ‘గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడంవల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం పై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను. గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను’అంటూ ప్రకటనలో తెలిపారు.