నెల్లూరు పంచాయితిపై సీరియస్

నెల్లూరులో మొదలైన ఎంఎల్ఏల పంచాయితిపై జగన్మోహన్ రెడ్డి మండిపోతున్నారు. ఓ అధికారికి నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య మొదలైన వివాదం చివరకు అరెస్టువరకూ వెళ్ళటంతో పార్టీ పరువు పోయినట్లైంది. చిన్న వివాదాన్ని సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెనకుండి ఎంపిడివోను నడిపించటంతోనే వివాదం చివరకు కోటంరెడ్డి అరెస్టు దాకా వెళ్ళిందని జగన్ కు అర్ధమైపోయింది.

ఎప్పుడైతే చిన్న వివాదం కాస్త పెద్దదైపోవటంతో జగన్ ఎంఎల్ఏల పై మండిపోతున్నారు. అందుకనే బుధవారం సాయంత్రం జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. అంటే నెల్లూరు పంచాయితిని జగన్ ప్రత్యక్షంగా టేకప్ చేసినట్లే లెక్క. నిజానికి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పార్టీ ఇమేజిని పెంచటానికి జగన్ నానా అవస్తలు పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

ఒకవైపు జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే మరోవైపు నెల్లూరు జిల్లాలో ఎంఎల్ఏల మధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది. ఈ పోరాటమే చివరకు పార్టీ పరువును బజారున పడేస్తోంది. దాంతో జగన్ చాలా సీరియస్ అయ్యారు. ఇద్దరు ఎంఎల్ఏల మధ్య వివాదానికి నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా కారణమనే ఆరోపణలున్నాయి. అందుకనే ముఖ్య నేతలందరితోను జగన్ సమావేశం అవుతున్నారు.

వ్యక్తిగత వివాదాన్ని ప్రభుత్వ వివాదంగా మార్చటం, అందులోను ఓ ఎంఎల్ఏ అరెస్టుకు దారితీయటంతో  పార్టీ ఇమేజి దెబ్బతిన్నది. ఈ విషయంపైనే ఎంఎల్ఏలపై జగన్ మండిపోతున్నారట. మరి ఈరోజు సాయంత్రం జరిగే పంచాయితిలో ఎవరికి జగన్ క్లాసు తీసుకుంటారో అన్న విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.