నా ప్రాణాలకు రక్షణ లేదు… బాంబు పేల్చిన ఎన్నికల కమిషనర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాంబు పేల్చారు.. తన ప్రాణాలకు రక్షణ లేదని.. కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖకు భారీ లేఖ రాశారు. హైదరాబాదులో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా పరిస్థితులు మారిపోయాయి. ఏకంగా సీఎం జగన్ మోహన్ ఎన్నకల కమిషనర్ రమేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ నేతలంతా రమేష్‌పై విరుచుకు పడ్డారు. ఎన్నికల వాయిదాపై సుప్రీంను ఆశ్రయించారు. ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ రమేష్ కేంద్ర హోం శాఖకు ఐదు పేజీల లేఖ రాయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రమేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

లేఖలో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఎన్నికల తర్వాత కూడా తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని రమేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను హైదరాబాద్‌లో ఉంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు తాను రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి హింసకు తావులేకుండా గట్టి భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినా ఎన్నికల్లో హింస జరిగిందని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలను ప్రస్తావించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మీద దాడులు జరిగినట్టు వివరించారు. అలాగే, స్థానిక సంస్థల్లో 2014లో ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి, ఇప్పుడు ఎన్ని అయ్యాయనే వివరాలను సైతం ప్రస్తావించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో ఏకగ్రీవాలపై కూడా రమేష్ కుమార్ లేఖలో రాయడం గమనార్హం.

మరి ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా కేంద్రానికి ఆయన లేఖ రాయడంపై ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!