దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు అవసరం లేదు..

కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రవర్తన నియమావళి కి అనుగుణంగా నే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేస్తామని, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్. రమేష్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలలో ప్రత్యేక సీనియర్ అధికారులను నియమించామని, వారు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించారన్నారు. జిల్లా కలెక్టర్ లతో సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల ను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలియజేశారు.

ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేయాలని గతంలోనే చెప్పామన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలుపై సమీక్షలు చేసుకోవచ్చుని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర సంబంధించిన పత్రాల జారీ విషయంలో ఫాస్ట్ ట్రాక్ విధానంలో జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ని పోలీస్ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ పై నమ్మకం ఉందన్న రమేష్ కుమార్.. డీజీపీతో కూడా మాట్లాడం జరిగిందని, ఎన్నికలను పూర్తి సజావుగా నిర్వహించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించామన్నారు. నామినేషన్ లు వెయ్యకుండా అడ్డుకునే సంఘటనలు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాటు చేసిన నిఘా యాప్ ను స్వాగతిస్తున్నామని, ఎన్నికల కమిషన్ చేపడుతున్న చర్యలకు అదనంగా యాప్ సేవలు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలతో ఏర్పాటు చేసుకున్న దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మాయావతి, కాన్షిరాం విగ్రహాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనలను రమేష్ కుమార్ ప్రస్తావించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల తొలగింపుపై హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. ఇచ్చిన సమయంలోపు తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈనెల 15న మొదటివిడత , 17న రెండవ విడత పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. వాలెంటీర్లు తమ విధులు నిర్వహించుకోవచ్చని, అయితే పార్టీ ప్రచారాలు మాత్రం చేయకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.