మొత్తానికి తెలుగుదేశంపార్టీ కూడా ఉప ఎన్నికలో పోటికి దిగుతోంది. అది కూడా ఎవరితోను పొత్తులు లేకుండానే సుమా. పార్టీ నేత కిరణ్మయిని తమ అభ్యర్ధిగా తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి తొందరలో ఉప ఎన్నిక జరగబోతోంది. అసలు ఉపఎన్నికలో పోటి చేయాలా ? వద్దా ? అనే విషయంలో నిర్ణయం తీసుకునేందుకే చంద్రబాబునాయుడుకు చాలా రోజులు పట్టింది.
పోటి విషయంలో తెలంగాణాలో మిగిలిన అరా కొరా నేతలతో రెండు మూడు సార్లు సమావేశమై చాలా సీరియస్ గా చర్చించారు. పోటి చేస్తే ఓటమి ఖాయం కాబట్టి ఉన్న పరువు కాస్త పోతుందని కొందరు నేతలు సందేహించారు. అదే సమయంలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే గెలుపోటములతో సంబంధాలు లేకుండా పోటి చేయాలని మరికొందరు నేతలు సూచించారు.
నేతలు తలోమాట చెప్పటంతో మొత్తానికి చంద్రబాబు పోటి చేయాలనే డిసైడ్ చేశారు. పోటి చేయటానికి ముగ్గురు, నలుగురు నేతలు పోటి పడినా మొత్తానికి చంద్రబాబు కిరణ్మయి అభ్యర్ధిత్వం వైపే మొగ్గు చూపటంతో ఆమె అభ్యర్దిగా ఖరారయ్యారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అభ్యర్ధుల ఎంపిక విషయాన్ని చివరి వరకు నాన్చి నామినేషన్ ఆఖరు రోజుకు ముందు రోజు మాత్రమే ప్రకటించటం. టిఆర్ఎస్ నుండి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుండి పద్మావతి, బిజెపి నుండి కె. రంగారావు పోటి చేస్తున్న విషయం తెలిసిందే.