సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వరంగల్ ఉమ్మడి జిల్లా పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీలో వర్గాల మధ్య కుమ్ములాటలు కూడా తీవ్రమవుతున్నాయి. ఒకరిని బదనాం చేసేందుకు ఇంకొకరు ప్రయత్నిస్తుంటే మిగతావాళ్లు కూడా అదే పనిలో ఉన్నారు. దీంతో అధికార టిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ వర్సెస్ కొండా దంపతులు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరింది రాజకీయం. తాజాగా కొండా సురేఖ మేయర్ వర్గానికి స్ట్రాంగ్ ఛాలెంజ్ విసిరారు. ఆ వివరాలేంటో చదవండి.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆమె 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ఒక రూమర్ బయటకొచ్చింది. అది గిట్టని వారు చేశారా? లేక కొండా సురేఖ టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉండి ఆమె వర్గం నుంచే వచ్చిందా అన్నది పక్కనపెడితే తాజాగా కొండా సురేఖ మీద మేయర్ నన్నపనేని నరేందర్ వర్గం తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. కమిషన్ల కోసం రోడ్డు పనులను కొండా సురేఖ అడ్డుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించింది. శిలాఫలకం మీద పేరు పెద్దగా లేకపోతే సురేఖ అలిగారని కూడా ఆరోపించింది.
ఈ ఆరోపణలపై కొండా సురేఖ ఘాటుగానే రియాక్డ్ అయ్యారు. తాను ఎప్పుడైనా ఎక్కడైనా కమిషన్ల కోసం రోడ్డు పనులు జరగకుండా అడ్డుకున్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. అలా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాల్ చేశారు. వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీకి ప్రజలు అండగా ఉన్నారన్న విషయం మరచి కొందరు పనిలేని వారు చేసే విమర్శలకు అర్థం లేదని మండిపడ్డారు. చాలారోజుల తర్వాత వరంగల్ మేయర్ పై కామెంట్స్ తో కొండా సురేఖ హాట్ పాలిటిక్స్ లోకి వచ్చారు.
స్పీకర్ చారితోనూ కొండా సురేఖ వైరం..
మరోవైపు కొండా సురేఖకు జిల్లాలో మరింత మంది శుత్రవులు ఉన్నట్లు కనబడుతున్నది. భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మధుసూదనాచారి ప్రస్తుతం స్పీకర్ గా కొనసాగుతున్నారు. ఆయనతోనూ కొండా దంపతులకు విబేధాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో మధుసూదనాచారి భూపాలపల్లిలో గట్టెక్కడం కష్టమే అని కొండా ఫ్యామిలీ అంటున్నది. మధుసూదనాచారిపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆమె చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సిఎం కేసిఆర్ సాహసం చేసి మధుసూదనాచారికే టికెట్ ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని చెబుతున్నారు. అయితే తమ రాజకీయ వారసురాలిగా కొండా సుశ్మితా పటేల్ ను భూపాలపల్లి బరిలో దింపాలని చూస్తున్నట్లు చెప్పారు. ఆమెకు భూపాలపల్లి టికెట్ ఇస్తే సునాయసంగా గెలుస్తామంటున్నారు. ఈ విషయాన్ని సిఎం కేసిఆర్ దృష్టికి కూడా తీసుకుపోయినట్లు చెప్పారు.
సిఎం కేసిఆర్ కు, స్పీకర్ మధుసూదనాచారికి దగ్గరి సంబంధాలున్నాయి. ఉద్యమకాలం నుంచీ మధుసూదనాచారి కేసిఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలోనూ చారి పార్టీలోనే కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో వ్యతిరేకత నెలకొందని భావించిన చారి కంప్లిట్ గా నియోజకవర్గంలోనే బస చేస్తున్నారు. అనునిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. రోజుకో గ్రామంలో రాత్రి నిద్ర చేసి జనాల సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన మీద ఉన్న వ్యతిరేకత తగ్గింది అన్న భావనలో టిఆర్ఎస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొండా సురేఖ ఫ్యూచర్ ఏమిటి? ఆమె టిఆర్ఎస్ లోనే కొనసాగుతారా? లేక కాంగ్రెస్ చేరతారా అన్నదానిపై ఇప్పటికిప్పుడు క్లారిటీ రాలేమంటున్నారు.