ఎద్దు ఈనింది అనగానే దూడను కట్టేయమన్న సామెతలాగే ఉంది బిజెసి నేతల వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించటమే బిజెపి నేతల టార్గెట్ గా ఉంది చూడబోతే. చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలు గుడ్డిగా జగన్ పై ఆరోపిస్తున్నారన్నా, విమర్శిస్తున్నారన్నా అర్ధముంది. ఎందుకంటే వైసిపి చేతిలో టిడిపి చావు దెబ్బ తిన్నది కాబట్టి జగన్ అంటే చంద్రబాబు అండ్ కో కు ఉక్రోషం పేరుకుపోయింది.
ఇదంతా ఎందుకంటే తిరుమలకు వెళ్ళే బస్సుల మీద హజ్, జెరూసలేం యాత్రలకు సంబంధించిన ప్రకటనలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందే వెంటనే టిడిపితో పాటు బిజెపి నేతలు జగన్ ప్రభుత్వంపై రెచ్చిపోవటం మొదలుపెట్టారు. జగన్ క్రిస్తియన్ కాబట్టి తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారాన్ని చూడనట్లే వదిలేస్తున్నారంటూ గగ్గోలు మొదలుపెట్టారు.
కాసేపు అయిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ప్రయాణీకులకు బస్సుల్లో ఇచ్చిన టికెట్లు 2018లోనే ముద్రించినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే, ముస్లిం సోదరులు, క్రైస్తవులకు టిడిపి ప్రభుత్వం అందిస్తున్న కానుకలు, చంద్రబాబు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలున్నాయి. దాంతో విషయం తెలుసుకోకుండా ముందు రెచ్చిపోయిన నేతలు ఇపుడు మౌనంగా ఉండిపోయారు. అయితే ఈలోగానే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది.
నిజానికి బిజెపి నేతలకు జగన్ ను ఇంతలా విమర్శించాల్సిన అవసరం కానీ ఆరోపణలు చేయాల్సిన పని కానీ లేదన్నది వాస్తవం. ఏ విషయంలో అయినా రాజకీయంగా గెలుపోటములు తేల్చుకోవాల్సినవి వైసిపి-టిడిపిలే. మధ్యలో బిజెపి దూరితే మాడు పగిలేది కమలనాధులకే.
అలాగని జగన్ ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నా చూస్తు కోర్చోవాల్సిన అవసరం లేదు. నిజంగా తప్పు జరిగితే ఖండించాల్సిందే. శ్రీశైలం ఆలయంలో ఈవో అన్యమతస్తులకు షాపులు కేటాయించారని బిజెపి నేతలు ఆరోపించారు. విషయం ఆరాతీసిన ప్రభుత్వానికి నిజమే అని తెలిసింది. వెంటనే ఈవోను బదిలీ చేసేశారు. చేసే ఆరోపణలు నిర్దిష్టంగా ఉండాలి కానీ గుడ్డిగా వ్యతిరేకిస్తామంటే కుదరదు. జరిగే ప్రతిదానికి జగన్ ప్రభుత్వందే బాధ్యత అని రెచ్చిపోతే కమలానికి ఉండే నాలుగు రేకులు కూడా ఊడిపోతాయని తెలుసుకోవాలి.