చిరంజీవి ఫ్యాన్సంతా జనసేనలోకి, నాగబాబు గ్రీన్ సిగ్నల్

జనసేన విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎలా ఉంటాడనేది ఇప్పటికీ ప్రశ్నే. ఆయన ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు.   జనసేన విషయంలో ఆయన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ గురించి చిరంజీవి లాంటి వ్యక్తి ఒక పార్టీ లో ఉంటూ కామెంట్స్ చేయడం సాధ్యం కాదు.అయితే, తమ్ముడు పవన్ కు  అండగా ఉండేందుకు చిరంజీవి సిద్ధమయినట్లు స్పష్టంగా  సంకేతాలు వెలువడ్డాయి. చిరంజీవి ఇపుడు సినిమా ల బిజీలోఉన్నారు. ఇక ముందు కూడా ఇలాగే సినిమాలలో ఆయన బిజీ గా ఉంటారు. క్రియాశీల రాజకీయాలనుంచి కనుమరగయినట్లే లెక్క. కాంగ్రెస్ నుంచి రాజీనామా చేయలేదు గాని, కాంగ్రెస్ కార్యకలపాలలో పాల్గొనక చాలా రోజులయింది. ఇపుడు ’సైరా‘ చిత్ర నిర్మాణంలో ఉన్నారు. ఆపై కూడా మరొక రెండు భారీ బడ్జెట్ చిత్రాలను అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్న వదిలేసింది. వచ్చే ఎన్నికలకు ఆయన సహకారం కోరే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు లేవు. ఎందుకంటే, కాంగ్రెస్ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ లోకి రప్పించేందుకు  ప్రయత్నాలు జరగుతున్నాయి. అదే విధంగా కిరణ్ కు సన్నిహితంగా ఉన్న  రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపి హర్ష కుమార్ లను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. అయితే, చిరంజీవి విషయంలో పార్టీలో ఎలాంటి కదలిక లేదు. ఒక వేళ ఉన్న ఆ ముచ్చట ఎక్కడా వినిపించడం లేదు.

 

 

అయితే, ఆయన సైన్నాన్ని జనసేనలోకి పంపిస్తున్నారు. చిరంజీవి అభిమానులెక్కడ ఉన్న ఇపుడు జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి అభిమానుల సైన్యం జనసేనలో చేరిపోయి, వచ్చే ఎన్నికలలో అత్యంత కీలకబాధ్యతను నిర్వర్తించబోతున్నారు.

Ravanam Swamy Naidu

ఇపుడు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, అఖిల భారత చిరంజీవి యువత సంస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఇపుడు జనసేనలో చేరుతున్నారు. స్వామినాయుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే, నిన్న ఆయన తనపదవికి రాజీనామా చేశారు. జూలై 9న జనసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ’తెలుగు రాజ్యం’ ప్రతినిధితో మాట్లాడుతూ ధృవీకరించారు. ’అఖిలభారత చిరంజీవి యువత ను 16 సంవత్సరాల కిందట స్థాపించాం.ఇందులో ఆరులక్షల మంది సభ్యులున్నారు. మా సభ్యులంతా జనసేనలో చేరుతున్నారు. అందరికి ఈ మేరకు పిలుపు నిచ్చాం. జూలై 9 తేదీన దాదాపు లక్ష మంది  జనసేన సభ్యత్వం తీసుకుంటారు,’అని స్వామినాయుడు చెప్పారు.

చిరంజీవి అనుమతి తీసుకున్నారా అన్నపుడు, ‘చిరంజీవి ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన సినిమా నిర్మాణంలో బిజిగా ఉన్నారు.  మా నిర్ణయం ఆయనకు చేరవేశాం. నాగబాబు గారు మాకు అనుమతినిచ్చారు,’ అని స్వామినాయుడు చెప్పారు.

‘అఖిలభాతర చిరంజీవి యువత పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది. దేశం ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఎదురయినా విరాళాలు సేకరించి బాధితులకు అందించడం, సహాయకార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. ఉత్తరాఖండ్ వరదలపుడు,  హుదద్ విశాఖ బీభత్సం తర్వత మా సభ్యులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమమాల్లో పాల్గొన్నారు. సహాయనిధి సమీకరించి అందించారు. లెక్కలేనన్ని సార్లు రక్తదానాలు చేశారు. ఇపుడు రాజకీయ కార్యక్రమంలోకి వస్తున్నాం,’ అని ఆయన చెప్పారు.

జనసేనలో నిర్వహించబోయే బాధ్యతల గురించి మాట్లాడుతూ , తమ సంస్థ సభ్యలు జనసేనలో భాగమయ్యాక వోటర్లకు వోటు ప్రాధాన్యం వివరించే కార్యక్రమం, వోటర్ తన వోటు తప్పనిసరిగా వినియోగించుకునే లా చూడటం వంటి వోటింగ్ స్పృహ పెంచే కార్యక్రమాలలో పాల్గొంటామని ఆయన చెప్పారు.

వోటర్లను పోలింగ్ బూత్ కు తీసుకువచ్చేందుకు తాము అట్టడుగు స్థాయిలో పనిచేస్తామని స్వామినాయుడు చెప్పారు.