అలాగనే అంటున్నారు ఒకప్పటి చంద్రబాబునాయుడు సన్నిహితుడు, ఆయనకు బినామీగా ప్రచారంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో చాలా తప్పులు చేసినట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు తప్పుల వల్లే వైసిపి అధికారంలోకి వచ్చిందని స్పష్టంగా చెప్పటం విడ్డూరంగా ఉంది.
విడ్డూరం ఎందుకంటే గడచిన పదేళ్ళు సుజనా కూడా టిడిపిలో చాలా కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగలిగిన కొద్దిమంది నేతల్లో సుజనా కూడా ఒకరని పార్టీలో ప్రచారంలో ఉంది. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు పక్కనే ఉన్నారు సుజనా.
సుజనా పై ఎన్ని కేసులున్నా చంద్రబాబు అండ వల్లే ఇబ్బంది లేకుండా కంటిన్యు అవుతున్నారు. చివరకు బ్యాంకులను వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులున్నా పట్టుపట్టి కేంద్రంలో మంత్రిగా ఇప్పించారు చంద్రబాబు. సరే పార్టీ ఓడిపోయిన తర్వాత ఉభయులకు ఉపయోగకరంగా ఉంటుందనే టిడిపిలోకి ఫిరాయించారు లేండి.
అలాంటి సుజనా తాజాగా మాట్లాడుతూ గ్రావిటి ద్వారా పోలవరం నీళ్ళిస్తానని చెప్పిన చంద్రబాబు ఆ పని చేయలేకపోయినట్లు చెప్పారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా చంద్రబాబు పట్టుబట్టి తన చేతుల్లోకి తీసుకున్న విషయాన్ని సుజనా గుర్తుచేశారు. అప్పట్లో చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో తాను విభేదించినట్లు కూడా చెప్పటం విచిత్రంగా ఉంది.
సరే ఏదేమైనా సుజనా మాత్రం ఇపుడు పక్కా బిజెపి ఎంపిగానే మాట్లాడుతున్నారు. రాజధాని మార్పుకు సంబంధించి మాట్లాడుతూ జగన్ అమరావతిని మారుస్తారని తాను అనుకోవటం లేదన్నారు. వరదలపై రెండు పార్టీల మధ్య జరిగిన రచ్చపై మాట్లాడుతూ అసలు వరదను మ్యానేజ్ చేయాల్సింది అధికారులే కానీ రాజకీయ నేతలు కాదన్నారు. అలాంటిది ఇరు పార్టీల నేతలు వరదలను కూడా రాజకీయం చేయటం ఏమిటో అర్ధం కావటం లేదన్నారు.