చంద్రబాబుకు సీనియర్లు పెద్ద షాక్

చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులుతో పాటు సునీల్, రూప తదితరులు పెద్ద షాకే ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన కోసం వచ్చినా పై నేతలు మాత్రం ఎక్కడా కనబడలేదు. రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో మొదటి రోజు సమీక్షలో వీళ్ళు కనబడలేదు.

మొన్నటి ఎన్నికల్లో కాకినాడ, రాజమండ్రి ఎంపి అభ్యర్ధులుగా ఓడిపోయిన చెలమలశెట్టి సునీల్, మాగంటి రూప ఎక్కడా  కనబడలేదు. వీళ్ళిద్దరి విషయం పక్కనపెట్టినా తోట గైర్హాజరు విషయాన్ని చంద్రబాబు ఆరా తీశారు.  చంద్రబాబు సమీక్ష చేస్తున్న విషయాన్ని చెప్పి నేతలు  ఆహ్వానించినా తోట స్పందించలేదు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలతో తోట దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో తొందరలో టిడిపికి తోట రాజీనామా చేయబోతున్నట్లు జిల్లాలో ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ నేపధ్యంలోనే చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నపుడు పార్టీలోని కాపు నేతల సమావేశంలో తోట చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు. దాంతోనే పార్టీకి తోట దూరమవుతున్నారనే సంకేతాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే రెండు రోజుల చంద్రబాబు పర్యటనకు తోట గైర్హాజరవ్వటంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైపోయింది.

ఈనెలలోనే తోట పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరబోతున్నట్లు బాగా టాక్ వినిపిస్తోంది. వైసిపి నేతలతో తోట రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు స్వయంగా జిల్లా పర్యటనకు వచ్చినా హాజరుకాలేదు. చూడబోతే ప్రస్తుతానికైతే తోట టిడిపికి మానసికంగా దూరమైపోయినట్లే కనబడుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.