టీడీపీకి మరో భారీ షాక్.. వైసీపీలోకి కరణం బలరాం!

ప్రతిపక్ష టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా పార్టీని వీడనున్నారన్న వార్త సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా బలరాం ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా రేపు బలరాం తన కొడుకుతో కలిసి రేపు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఇదే జరిగితే టీడీపీకి చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రకాశం జిల్లాలో టీడీపీ అంటే బలరాం, బలరాం అంటే టీడీపీ అన్నట్లు ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయనే పార్టీ మారుతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద షాక్‌ ఇవ్వనుంది.

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా నేడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ జెండా కప్పుకున్నారు. గత మూడు రోజులుగా ప్రచారం జరిగినప్పటికీ రామసుబ్బారెడ్డి తొలుత వాటిని ఖండించారు. ఆ తర్వాత ఒక్క రోజులోనే.. పార్టీ మారారు. జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలు చూసే వైసీపీలో చేరుతున్నానని చెప్పిన ఆయన.. టీడీపీలో నాయకత్వంపై ఆ పార్టీలో ఎవరికీ నమ్మకం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే మరో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు ఆ పార్టీకి గుడ్‌బాయ్‌ చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు. అయితే పంచకచర్ల కూడా వైసీపీలోనే చేరతారనే ఊగాహానాలు వినిపిస్తున్నాయి.

రానున్న వారం రోజుల్లో దాదాపు టీడీపీలోని సీనియర్ నేతలంతా కూడా పార్టీని వీడి వెళ్లిపోతారని, తాము తలుచుకుంటే ప్రతిపక్ష హోాదా కూడా ఉండదని వైసీపీ నేతలు గతంలోనే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే నిజం కాబోతోందని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలతో టీడీపీ ఖాళీ అయిపోతుందని కూడా టాక్ వినబడుతోంది.