కోడెల వ్యవహారం తెలుగుదేశంపార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఎన్నికలకు ముందు ఓ ఎత్తైతే ఎన్నికల తర్వాత మరో రకంగా కోడెల వల్ల పార్టీ పరువు పోతోంది. దాంతో కోడెల విషయంలో ఎలా వ్యవహరించాలో చంద్రబాబునాయుడుకు అర్ధం కావటం లేదు. ఒకరకంగా చంద్రబాబుకు కోడెల గుదిబండలాగ మారిపోయారు. ఉంచుకోలేరు అలాగని వదిలించుకోలేరు.
గతంలో ఏ స్పీకర్ కూడా ఇంతస్ధాయిలో గబ్బు పట్టలేదు. స్పీకర్ లాంటి అత్యున్నత స్ధానంలో కూర్చుని కూడా కోడెల చాలా చవకబారుగా వ్యవహరించారు. ప్రధానంగా వైసిపి ఎంఎల్ఏల ఫిరాయింపుల విషయంలో బాగా పలచనైపోయారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో విషయంలో వ్యవహరించిన విధానం కూడా బాగా తలవంపులు తెచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను చంద్రబాబు అండ్ కో ఎంతలా తిడుతున్నా ఎవరినీ వారించకుండా పూర్తి సమయం కేటాయించిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది.
జగన్ అండ్ కో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంలో కోడెల పాత్ర కూడా తక్కువేమీ కాదు. నిజంగా ఏమాత్రం విలువలు పాటించే వ్యక్తే అయితే చంద్రబాబుతో మాట్లాడి వైసిపి సభ్యులను అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేట్లు చర్యలు తీసుకునే వారే. కానీ కోడెలకు అటువంటివి ఏమీ లేవు కాబట్టే చంద్రబాబుకు కోడెల వంత పాడారు.
సరే అదంతా ఓ ఎత్తైతే ఎన్నికల సమయంలో కోడెలకు వ్యతిరేకంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా టికెట్ ఇవ్వకూడదంటూ బహిరంగంగానే వ్యతిరేకించారు. దాంతో రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరువు రోడ్డున పడింది. అయినా కోడెల సత్తెనపల్లిలో టికెట్ తెచ్చుకున్నారు. ఎన్నికల రోజున కోడెలను ఓ పోలింగ్ బూత్ లో చావ కొట్టారు. దాంతో పార్టీ పరువు బజారునపడింది. ఇక తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం విషయంలో అడ్డంగా దొరికిపోవటంతో చంద్రబాబుకు కోడెల వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. మరి ఏం చేస్తారో చూడాలి.