గుడివాడ మునిసిపాలిటీలో అవిశ్వాసం ప్రకంపనలు

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ పై అవిశ్వాస నీడలు కమ్ముకున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ వైసీపీకి చెందిన అడపా వెంకటరమణ (బాబ్జీ)  పై అవిశ్వాసం పెడుతూ 29మంది సభ్యులు లేఖను కలెక్టర్ కు అందజేశారు. గుడివాడ మున్సిపాల్టీలో 36 వార్డులు ఉండగా అందులో 20 స్థానాలు వైసీసీ, 16 స్థానాలు టీడీపీ గెలుచుకున్నాయి. దీంతో వైసీపీ అధికారం చేపట్టి మున్సిపల్ చైర్మన్ గా యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ గా బాబ్జీ ఎన్నికయ్యారు.

2016లో చైర్మన్ శ్రీనివాసరావుతో సహా 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. దీంతో టీడీపీ బలం 29మంది సభ్యులకు చేరింది. వైస్ చైర్మన్ బాబ్జీ మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. దీంతో వైస్ చైర్మన్ బాబ్జీ ని దించేసి ఆ పదవిని టిడిపి సొంతం చేసుకోవాలని టిడిపి నేతలు భావించారని వైసీపీ  నేతలు ఆరోపిస్తున్నారు.  ఆ కుట్రలో భాగంగానే బాబ్జీపై అవిశ్వాసం పెట్టారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

 

ఒక సంవత్సర కాలం ఉన్న పదవి కోసం టిడిపి చేస్తున్న  కుట్ర సరైనది కాదని వైసీపీ నేతలు అంటున్నారు. కార్పొరేటర్లకు కమీషన్లు ఎరగా చూపి టిడిపిలో చేర్చుకున్నారని టిడిపి దిగజారుడు రాజకీయాలు చేస్తుందని వారు విమర్శిస్తున్నారు. బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో టిడిపి పెట్టిన అవిశ్వాసానికి కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది. మున్పిపల్ లో సగానికి పైగా ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారివి ఉన్నాయని , అటువంటప్పుడు వైస్ చైర్మన్ ను తొలగించడానికి చేసిన పని సరైనది కాదని వారు విమర్శిస్తున్నారు.

 

అవిశ్వాస తీర్మానపు అధికారిగా ఆర్డీవోను నియమిస్తూ కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అవిశ్వాసం జరిగితే వైసీపీ విప్ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో టిడిపిలో చేరిన వైసీపీ కౌన్సిలర్లకు విప్ భయం పట్టుకుంది. ఒక వేళ అవిశ్వాసం పెట్టినా విప్ ద్వారా మేమే గెలుస్తామనే ధీమాతో వైసీపీ ఉంది.

వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెడితే.. చైర్మన్ పై కూడా అవిశ్వాస తీర్మానం తప్పేలా లేదు. టిడిపిలో ఉన్న లింగం ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ పదవికోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లను  ప్రసన్నం చేసుకొని ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసరావును ఒంటరి చేయాలని లింగం ప్రసాద్ భావిస్తున్నాడు. ఆ తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి తాను ఆ సీటులో కూర్చోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారని టిడిపి నేతలే బహిరంగంగా చెబుతున్నారు. సంవత్సర కాలం ఉన్న  పదవుల కోసం ఎన్నికలను తలదన్నేలా నేతలు ఒకరిపై ఒకరు వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు గుడివాడ మున్పిపల్ లో చర్చనీయాంశమయ్యాయి.