గంగా ప్రక్షాళనకు పోరాటం చేస్తాడట

రెండు రోజులు గట్టిగా జనాల్లో తిరిగితే మళ్ళీ ఓ 20 రోజులు పత్తా ఉండడు ఈ జనసేనాని. అలాంటిది ఉత్తరప్రదేశ్ లోని గంగానది ప్రక్షాళనకు పోరాటం చేస్తానని చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఏ ఊరికి పోతే ఆ ఊరిలో సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని ప్రకటించటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మామూలైపోయింది.

ఏదో నోటికొచ్చినట్లు ప్రకటన చేసేయటం తర్వాత దాన్ని గాలికొదిలేయటం పవన్ కు మామూలే. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పర్యటించిన ప్రతి ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావించారు. సమస్యల కోసం పోరాటాలు చేస్తానంటూ గట్టిగా మైకులు పగిలిపోయేట్లు అరిచి చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

పవన్ కు బహుశా గజని టైపు సమస్యలున్నాయేమోననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటి చేశారు. అయితే పవన్ వ్యవహారం బాగా తెలుసు కాబట్టే రెండు చోట్లా గుండుకొట్టారు. అయితే భీమవరంలో ప్రచారంలో భాగంగా యనమదుర్రు డ్రైన్ ప్రక్షాళనకు తాను కృషి చేస్తానని పదే పదే చెప్పారు.

సరే పవన్ ఎన్నిసార్లు చెప్పినా జనాలు నమ్మలేదనుకోండి అది వేరే సంగతి. పార్టీ ఓడిపోయినా, తాను స్వయంగా ఓటమిపాలైనా ఇచ్చిన మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తే పవన్ ను ఎవరైనా నమ్ముతారు. అంతేకానీ ఓడిపోయాం కాబట్టి సమస్యలతో తనకేమీ సంబంధం లేదనుకుంటే అంతే సంగతులు. అలాంటి పవన్ ఎక్కడో ఉన్న గంగానది ప్రక్షాళనకు పోరాటాలు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా ?