ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పలు దేశాలు ఇప్పటికే కొన్ని రోజులుగా కర్పూను విధించి జన జీవనంపై ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ వ్యాధి విజృంభణ ఆగడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ కథనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాటికి కరోనా మరణాల సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,189 మరణాలు సంభవించగా, ఒక్క యూరప్‌లోనే 9,197 మరణాలు నమోదయ్యాయి.
దేశాల పరంగా చూస్తే చైనా వెలుపల అత్యధిక మరణాలు సంభవించినది ఇటలీలోనే. చైనాలో ఇప్పటి వరకు 3,270, స్పెయిన్‌లో 2,182 కేసులు నమోదయ్యాయి. ఇటలీలో మాత్రం 5,476 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మరణాలు సంభవించాయి. 1,72,238 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,289కి పెరిగింది. యూరప్ ఖండంలో కోవిడ్19 శరవేగంగా వ్యాపిస్తోంది.
ఇక, భారత్‌లో నిర్భంధ కర్ఫూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. కోల్‌కతాలో 57 సంవత్సరాల వ్యక్తి ఆసుపత్రిలో మధ్యాహ్నం 3:35కు కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన తన కుటుంబంతో సహా ఇటలీ నుంచి వచ్చారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అలాగే, కరోనాకు మందు కనిపెట్టింది అని ప్రచారం జరుగుతున్న అమెరికాలో కూడా ఈ ప్రాణాంతకు వ్యాధి కొరలు చాస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా వైరస్ విలయతాండవానికి ఒక్కరోజే 100 మంది చనిపోయినట్టు ప్రముఖ జాన్స్ హాప్‌కీన్స్ యూనివర్సిటీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో మరణాల సంఖ్య 390కి చేరినట్టు రిపోర్టులో పేర్కొంది. అత్యాధునిక వైద్యసదుపాయాలు ఉన్న అమెరికాలో.. ఒక్కరోజులోనే 100 మంది చనిపోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్స్ఒమీటర్స్.ఇన్‌ఫో గణాంకాల ప్రకారం సోమవారం అమెరికాలో 33 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 452కు చేరినట్లైంది.