తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు తెరచుకున్నాయి. స్కూళ్ళకు, కాలేజీలకు విద్యార్థులు వెళుతున్నారు. ఇంకేముంది కరోనా వైరస్ విజృంభణ షురూ అయ్యింది. కొన్ని స్కూళ్ళలో పదుల సంఖ్యలో కోవిడ్ 19 బాధితులు వెలుగు చూస్తున్నారు. విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా కరోనా బారిన పడుతుండడం గమనార్హం. అదేంటీ, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసేశామని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చెబుతున్నాయి కదా.? అంటే, అదేంటో.. ఆ మ్యాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కావడంలేదు. నిజానికి, అధికారిక లెక్కల ప్రకారం చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కనిపిస్తోంది. కానీ, ఇక్కడ గమనించాల్సిన విసయం.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఒకప్పుడు లక్షకు పైగా టెస్టులు చేసిన పరిస్థితి వుండేది. ఇప్పుడది 60 వేలకు అటూ ఇటూగా పడిపోయింది. దాంతో, పాజిటివిటీ రేటు పెరుగుతున్నా.. కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల కనిపించడంలేదన్నమాట. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే.. రోజుకో రీతిన అక్కడ కేసులు నమోదవుతున్న తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తెలంగాణతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే వుంది. అక్కడే ఎక్కువగా స్కూళ్ళలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. దీన్ని మూడో వేవ్ అనొచ్చా.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. విద్యార్థుల్ని చదువుకి ఎక్కువ కాలం దూరంగా వుంచడం మంచిది కాదు. ఆన్‌లైన్ విద్య అయినా ఎన్నాళ్ళు.? ఇలాంటి ఆలోచనల నడుమ ప్రభుత్వాలు స్కూళ్ళను, విద్యా సంస్థల్ని తెరచినప్పటికీ.. అది ప్రాణాంతక నిర్ణయం అవుతోందన్న ఆవేదన మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.