కోర్టుల ఆవేదన.. వైసీపీ నేతల వైఖరి మారాల్సిందే
డిఫెన్స్.. రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల నుండి తమను తాము కాపాడుకోవడానికి, తమ పనుల్ని, పాలసీలను, పాలనను సరైనవని వాదించడానికి అన్ని పార్టీలు ఇదే పద్దతిని ఫాలో అవుతుంటాయి. కానీ వైసీపీ కొద్దిగా ఎక్కువగానే ఈ పద్దతిని పాటిస్తోంది. గెలుపు అనంతరం అధినేత వైఎస్ జగన్ పదవులను ఎలాగైతే పంచారో డిఫెన్స్ కోసం, ఇతర పార్టీలను తమ వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టడం కోసం కొందరిని సెలెక్ట్ చేశారు.
వారు జగన్ మీద, ఆయన పాలన మీద విమర్శలు చేసే నేతలపై తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. ఇన్నాళ్ళు నేతలు, ఇతర పార్టీల మీద ఈ డిఫెన్స్ టీమ్ శ్రుతిమించి మాట్లాడినా అది రాజకీయాల వరకే పరిమితం కాబట్టి సరిపోయింది. కానీ ఏకంగా న్యాయ వ్యవస్థ మీదనే విమర్శలు చేయడం ఇప్పుడు పార్టీనే ఇబ్నందుల్లోకి నెట్టింది. డాక్టర్ సుధాకర్ వివాదాన్ని సీఐడీకి అప్పగించడం, రంగుల జీవోను రద్దు చేయడం లాంటి హైకోర్టు తీర్పులు వైసీపీ నేతలకి నచ్చలేదు. దీంతో వెనకా ముందూ ఆలొచించకుండా కోర్టు వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.
లిమిట్స్ దాటిన వైసీపీ నేతలు, సోషల్ మీడియా :
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కేసు సీబీఐ చేతిలోకి వెళ్లడం మంచిదే అంటూనే అసలు కోర్టు తీర్పులు అంత త్వరగా చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయి. ఆయన కాల్ డేటాను చెక్ చేయాలి. చంద్రబాబు వ్యవస్థలని, హైకోర్టును మేనేజ్ చేసుకుని తిరుగుతున్నారు అంటూ మట్లాడారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఆమంచి అయితే లాక్ డౌన్ లేకుంటే కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేవాడినని అన్నారు. ఇక వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్టులైతే ఇక కోర్టు టీర్పులన్నీ తప్పున్నట్టు ప్రచారం మొదలుపెట్టారు.
న్యాయ వ్యవస్థ ఆవేదన :
నేతలే స్వయంగా న్యాయ వ్యవస్థల తీర్పులు సరిగా లేవని మాట్లాడటంతో ఆ పార్టీ ఫాలోవర్లు కూడా అదే పాట అందుకున్నారు. సోషల్ మీడియాలో కోర్టుల మీద పెద్ద ఎత్తున నెగెటివిటీ స్టార్ట్ మొదలైంది. దీన్ని గమనించిన న్యాయవాదులు ఇలా అధికార పక్షంమే కోర్టు తీర్పులను తప్పుబట్టడం, కులం, రాజకీయం, మతం రంగు పులిమి అనవసర విమర్శలు చేయడం వలన ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోందని అంటూ ఆమంచి, నందిగం సహా 49 మందిపై సుమోటోగా కేసు పెట్టి నోటీసులు జారీ చేశారు. ఇలా హైకోర్టు కేసులు పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఇకనైనా వైఖరి మారాలి :
నేతలు ఎవరైనా సరే వ్యవస్థలను తప్పుబట్టడం సరైన పద్దతి కాదు. అందులోనూ ఇలా న్యాయ వ్యవస్థ మీదే విమర్శలు మరింత ప్రమాదకరం. ఎవరికైనా సరే హైకోర్టు తీర్పు సంతృప్తికరంగా లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉంది. అంతేకానీ న్యాయస్థానాల ఉన్నతిని దెబ్బ తీసేలా నడుచుకోవడం సరికాదు. ఈ పరిణామంతో అయినా వైసీపీ వర్గం కళ్లు తెరిచి హద్దుల్లో నడుచుకుంటే మంచిది. లేపోతే పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లడం ఖాయం.