కుయ్ కుయ్ అన్నావ్..  కానీ కుయ్యో మొర్రో అంటున్నాయి !

Nara Lokesh

ఆపదలో ఉన్నా, ఎవరైనా ప్రమాదాలకు గురైనా ఒక్క ఫోన్ కొడితే చాలు నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సకాలంలో ఆసుపత్రులకు చేరుస్తూ వారికి పునర్జన్మను కల్పించే విధంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108 సేవలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆనాడు తండ్రి తీసుకొచ్చిన సేవలను మరింత పునరుద్దరిస్తూ, అత్యధిక టెక్నాలజీతో ఏపీ సీఎం జగన్ ఇటీవల 203 కోట్ల రూపాయల ఖర్చుతో 1088 కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 1088 కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురావడం దేశంలోనే రికార్డ్ అంటూ వైసీపీ నేతలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు.

కానీ టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం అంబులెన్స్ సేవల పేరిట వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, ఏ మాత్రం అనుభవం లేని అరబిందో ఫౌండేషన్ మాతృ సంస్థ అయిన అరబిందో ఫార్మాలో విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి కట్టబెట్టి దోపీడికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఈ అంబులెన్స్ సేవల తీరును ఎద్దేవా చేస్తూ కామెంట్స్ చేశారు. అప్పుడు కుయ్, కుయ్, కుయ్ అన్నారు కానీ అవి ఇప్పుడు కుయ్యో, మొర్రో అంటున్నాయని కాల్ చెయ్యగానే 108 ఎక్కడ జగన్ గారు అని అడిగారు. అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలో హెడ్ మాస్టర్ నారాయణ స్వామి అస్వస్థతకి గురై నడిరోడ్డుపై పడిపోయారు.

స్థానికులు 108కి కాల్ చేసిన అంబులెన్స్ రాక ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. స్కామ్ కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని, జగన్ రెడ్డి గారికి ప్రచార ఆర్బాటంపై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణమని లోకేశ్ ఆరోపించారు.