కాంగ్రెస్ లోకి నల్లారి కిరణ్ ఎందుకొస్తున్నట్లు?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయాల్లో చల్లారి పోయారని అనుకున్నారు. ఎందుకంటే, సొంతపార్టీ ‘సమైక్యాంధ్ర’ నడపలేడు, అది వుందో లేదో కూడా తెలియదు. మరో పార్టీలోకి మాజీముఖ్యమంత్రిగా వెళ్లి పరువుగా తలెత్తుకు తిరగడం కష్టం.  ఆత్మాభిమానం చంపుకుని కాంగ్రెస్ లోకి వెళ్లడమా అంటే, కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగుండటం లేదు. అందువల్ల ఆయన పొద్దున సాయంకాలం జాగింగ్ చేస్తూ, నాలుగు పుస్తకాలు తిరగేస్తూ, తీరికసమయంలో టివిలో  క్రికెట్ చూస్తూ, హైదారాబాద్-బెంగుళూరు మధ్య షికార్లు చేస్తూ కాలపు గడపుతున్నందున రాజకీయాల్లో ఇక చల్లారిపోయినట్లే అనుకున్నారు. ఇలాంటపుడు ఆయన కాంగ్రెస్ లోకి వస్తున్నారనే వార్త గుప్పు మంది.

 

కాంగ్రెస్ లోకి ఎందుకు వస్తున్నారు? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.

 

ఒక దఫా ముఖ్యమంత్రిగా పని చేశాక,  రాజకీయాల్లోఆయనంత మౌనంగా ఉండటం అందరికి సాధ్యం కాదు. ఆయన గతనాలుగేళ్లుగా మాట వినిపించపోవడమే కాదు, మనిషి కూడా కనిపించలేదు.  తెలంగాణలో కెకె, డిఎస్, డాక్టర్ రాజయ్య, మంధా జగన్నాధం వంటి  నోరున్న కాంగ్రెస్ నాయకులు టిఆర్ ఎస్ లో చేసి నోరు పొగొట్టుకుని ఉనికి లేకుండా చేసుకున్నారు. కిరణ్ కు అలాంటి పరిస్థితి లేదు. పోలవరం నుంచి అమరావతి నుంచి చిత్తూరు జిల్లాకు కిరణే ప్రకటించిన మంచినీళ్ల ప్రాజక్టు దాకా ఎన్నింటిమీదో మాట్లాడవచ్చు. అయితే, తానే మొదలుపెట్టిన పథకాలను మూసేస్తున్నా  కిరణ్ మాట్లాడటంలేదు. అందుకే రాజకీయల్లో నల్లారి వేడి చల్లారి పోయిందని అనుకున్నారు.

అపుడపుడు ఆయన నోట వినిపించిన  మాటలు కూడా ఆయన చెప్పాలను కుని చెప్పినవి కాదు.  ఎదో ఒక పంక్షన్ లో మీడియా వాళ్లకు తారసపడినపుడు చెప్పినవే. ఒక దుర్ఘటన మీద ఆయన స్పందించ లేదు. ఒక రాజకీయ నిర్ణయం మీద కామెంట్ లేదు. బహిరంగంగా ఎవరికీ అభినందనలు కూడా చెప్పినట్లు లేదు. సంతాపం సంగతి సరే సరి. ఇలాంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇపుడు ఉన్నట్లుండి కాంగ్రెస్ లోకి మళ్లీ వస్తున్నాడనే వార్త గుప్పమనింది. తొందర్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎఐసిసి ఇన్ చార్జీ ఊమెన్ చాందీని కూడా కలుస్తాడని చెబుతున్నారు.

ఇది కొంచెం తికమక పెట్టే వ్యవహారమే. ఎందుకంటే, 1. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పట్లో లేచినిలబడతుందన్న గ్యారంటీ లేదు. అలాంటి పార్టీలోచేరి ఆయన చేసేదేముంటుంది. 2. ఆ మధ్య ఆయన సొంత తమ్ముడిని తెలుగు దేశం లోకి పంపారు. ఆతర్వాత ఆయన కూడా టిడిపిలోకి వెళతారనే అంతా భావిస్తున్నారు. అయితే ఇలాంటపుడు ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెబుతున్నారు. ఎఐసిసి సినయర్ నాయకులు ఆయనతో మాట్లాడారని, ఆయనకూడా మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.  అదే, ఎందుకు అని.

ఈ ప్రశ్న ఎందుకంటే, ఆయన చేసెకి పార్టీలో పెద్ద పదవిలేదు. ఉన్నంతలో పిసిసి అధ్యక్షుడిగా ఎన్ రఘవీరారెడ్డి బాగా చేస్తున్నాడన పేరొచ్చింది. ఆయన్ని మార్చి కిరణ్ ను పిసిసి అధ్యక్షుడిగా చేస్తారా? అనుమానమే.

కాంగ్రెస్ వర్గాల్లో వినవడుతున్నదాని ప్రకారం ఆయన జాతీయనాయకత్వం నుంచి మంచి హామీ లభించిందని చెబుతున్నారు. రాష్ట్రానికి కాకుండా ఆయన సేవలను పార్టీ జాతీయస్థాయిలో వాడుకుంటుందని సినియర్ నాయకులొకరు ‘తెలుగు రాజ్యం’కు చెప్పారు.

ఎలా అన్నది స్పష్టం చేయలేదు. ‘ పార్టీ హైకమాండ్ అనుకుంటే కిరణ్ ను ఎన్నో రకాలు పార్టీ కోసం వాడుకోవచ్చు. ఎంతయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఒక దశలో ఆయన చాలా బాగా పనిచేస్తున్నారని కూడా పేరొచ్చింది. ఆయన్నెవరూ పార్టీ నుంచి పంపలేదు. ఆరోజు పరిస్థితుల్లో ఆయనే వెళ్లిపోయారు. కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఇలా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి, కొత్త పార్టీ పెట్టుకుని, దానిని నడపలేక లేదావిలీనంచేసో మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చినవారు కొకొల్లలు. తమిళనాడులోని మూపనార్ ఇదే చేశాడు. కిరణ్ పార్టీలోకి రావచ్చు. ఆయన ఎఐసిసి జనరల్ సెక్రెటరీ గా చేయవచ్చు.  కాంగ్రెస్ నాయకత్వంలో యూపిఎ  ప్రభుత్వం వస్తే రాజ్యసభ కు తీసుకోవచ్చు. కొద్ది రోజులు గవర్నర్ గా పంపవచ్చు షిండే లాగా. ఆయనకు మొత్తం నేషనల్ అసైన్ మెంట్ ఉంటుంది,’ అది ఆయన చెప్పారు.

అదీ సంగతి.