ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారం కాస్తా ఇప్పుడు ఇద్దరు నేతల వాగ్యుద్ధంగా.. రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు మాత్రమే కాదు.. వ్యక్తిగత దూషణలతో ట్వీట్ల మోత మోగిస్తూ.. మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు ఆ ఇద్దరు నేతలు.
‘బాధ్యతగల విపక్ష నేతగా నేను ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా.. వ్యక్తిగత దూషణలకు దిగారు అంటే.. మరి ఏదో తప్పు జరిగినట్లే కదా..’ అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కొత్త రాగం అందుకున్నారు. విజయసాయిరెడ్డి మగడాయితే తనతో పాటు కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. ర్యాపిడ్ టెస్టు కిట్ల ధరలపై పారదర్శకత నిరూపించుకోవాలని ట్వీట్ చేస్తే విజయసాయిరెడ్డి స్పందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కొనే దమ్ము ఎవరికీ లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విజయ సాయి రెడ్డిపై పరువునష్టం దావా కూడా వేస్తానన్నారు కన్నా.
అయితే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఏమీ తగ్గడం లేదు. బీజేపీ నాయకులెవరూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని, కన్నా ఒక్కరే చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని జగన్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. కన్నా లాంటి వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లతోనే నోరు మూయించే పనిలో బిజీగా ఉన్నారు.
అయితే ఈ వాదనల పర్వం ఎలా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం కిట్ల కొనుగోలుకు సంబంధించిన విమర్శల నేపథ్యంలో మరి కర్నాటక కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్న దానికన్నా ఎక్కువే పెట్టి కొనింది కదా మరి అది కనిపించలేదా కన్నాకు అంటే.. ఆ పని చేయాల్సింది విజయ సాయి రెడ్డి అట. పార్లమెంటులో ఆ విషయాన్ని ఆయనే తేల్చాలట. అన్నీ బాగానే ఉన్నాయి గానీ.. ఇలా అధికార పక్షాన్ని విమర్శించడంలో.. ప్రశ్నించడంలో కన్నా చూపిస్తున్న ఆసక్తిలో కొంతైనా కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీని అడిగితే బాగుంటుంది కదా.. అన్నీ తెలుస్తాయి.. రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది, అన్న గుసగుసలు ఆ పార్టీలోని కొందరు కార్యకర్తలు అనడం విశేషం.