తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే వివిధ పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీన్ తలపిస్తుంది. టిడిపి అధినాయకుడు చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉండటంతో ఆయనకు రాష్ట్రమంతా పర్యటించి కార్యకర్తలను కలుసుకునే సమయం లేదు. దీంతో ఆయన తనయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసి ప్రజల్లోకి వెళ్లనున్నాడు.
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరుయాత్ర పేరుతో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. వీరిద్దరూ కూడా సీఎం అభ్యర్థులే. వారి పర్యటనలకు విపరీతంగా జనం వస్తున్నారు. ఇందులో టిడిపి వెనకబడే ఉంది. ప్రధాన పార్టీ అయిన టిడిపిలో చంద్రబాబు తర్వాత లోకేషే కథ నడిపేది. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిన వ్యక్తే. పార్టీలో ఇప్పటికే ఆయన్ను ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా, కాబోయే ముఖ్యమంత్రి అనే ఇంప్రెషన్ రాష్ట్రమంతా ఇవ్వాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో ఆయన మీద అంతా నెగెటివ్ పబ్లిషిటీ వచ్చింది. ఇదంతా పోవాలంటే ఐటి రివ్యూలు చేస్తూన , పార్టీ మీటింగులకు హాజరవుతూ ఉంటే చాలదు. జనం లోకి వెళ్లాలి. పెద్ద ఎత్తున జనాన్ని ఆకట్టు కోవాలి. జనం ఆమోదం పొందాలి. వైసిపి నేతలు చీటికి మాటికి ఆయన –పప్పు- అని ఎగాతాళి చేస్తుంటారు. ఈ అపఖ్యాతి నుంచి బయటపడేందుకు యాత్ర ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు.ట్విట్టర్ లో కంటే వైసిపి, జనసేన చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ట్విట్టర్ కంటే యాత్రే బలమయినది. ప్రస్తుత తరుణంలో చంద్రబాబు పర్యటించే సమయం లేనందున లోకేష్ రంగంలోకి దింపుతున్నారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేష్ మూడు రోజులు అధికారిక కార్యక్రమాల్లో, మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్త పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. తన పర్యటనలతో టిడిపి శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేయనున్నారు. లోకేష్ జిల్లాల వారీగా పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులను ప్రజలకు వివరించనున్నారు. వారి సమస్యలను తెలుసుకోని అక్కడే పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. జిల్లా పర్యటనల ద్వారా క్యాడర్ లో ఏమైనా విబేధాలు ఉంటే కార్యకర్తలతో కలిసి పోయే విధంగా నేతలకు లోకేష్ పలు సూచనలు చేయనున్నారు. రెండు మూడు నెలల్లో మొదటి విడత పర్యటన పూర్తి చేసుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ప్రణాళికలు కూడా వేశారు. ధర్మ పోరాట సభలను కూడా నిర్వహించాలని టిడిపి శ్రేణులు నిర్ణయించారు.
ప్రస్తుతం జగన్ పాదయాత్ర, పవన్ వరుస రాజకీయ పర్యటనలతో ఆంధ్రా రాజకీయం వేడెక్కింది. వీరిద్దరూ కూడా టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ యాత్రలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ వారి వ్యాఖ్యలను తిప్పి కొడుతూ పర్యటన చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయమే లక్ష్యంగా లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు ఉండబోతున్నాయి. లోకేష్ రాజకీయ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా సాగనుంది. లోకేష్ ప్రజల్లోకి వెళ్లి ఎంత వరకు విజయం సాధిస్తాడోనని కొంత మంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి లోకేష్ పర్యటన ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు ముఖ్య నేతల వరుస పర్యటనలతో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. లోకేష్ రాకతో ఇకపై నేతల మధ్య మాటకు మాట పెరిగే అవకాశం ఉంది. ముగ్గురు నేతల పర్యటనల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారోనని అంతా చర్చించుకుంటున్నారు.