ఆ ఇద్దరు వైసిపి నేతలకు జగన్ చెక్

వైసీపీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలను పార్లమెంట్ కు పంపడానికి రంగం సిద్దమైంది. ప్రస్తుతం వైసీపీలో కీలకంగా ఉన్న ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేశారు. ఈసారి వారు ఎంపీలుగా పోటీ  చేయక తప్పదని జగన్ వారికి అల్టిమేటం జారీ చేశారు.  పార్టీ అధినేత ఆదేశాలతో 2019 తర్వాత వైసీపీ అధికారంలో కి వస్తే  తాము మంత్రులుగా పనిచేయాలనుకున్న వారి ఆశలు నెరవేరేలా లేవని వారు మదన పడుతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు కీలక నేతలు చదవండి స్టోరీ…

ఉత్తరాంధ్రలో కీలక నేతలైన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రకటనతో కాంగ్రెస్ కనుమరుగవ్వటంతో వారంతా వైసీపీలో చేరారు. కాంగ్రెస్ లో వారికున్న పేరుతో వైసీపీ అధినేత జగన్ వారికి పార్టీలో ప్రాధాన్యత కలిగిన పదవులు అప్పగించారు. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని వైసీపీ నాయకత్వం భావిస్తుంది. అధికారంలోకి వస్తే ఈ ఇద్దరు నేతలు కూడా మంత్రి వర్గంలో చేరాలని ఆశతో ఉన్నారు. వారిద్దరు మంత్రులైతే వారితో కాస్తో కూస్తో ఇబ్బందులు తప్పవేమోనని జగన్ అనుకుంటున్నారు. వారు మంత్రి వర్గంలోకి వస్తే  నిర్ణయాలలో వారు అడ్డుపడుతారని జగన్ అనుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే వారిద్దరిని ఎమ్మెల్యేలుగా కాకుండా ఎంపీలుగా పోటి చేయించి పార్లమెంట్ కు పంపిస్తే ఏ ఇబ్బంది ఉండదని జగన్ భావిస్తున్నారు. వారిని ఎంపీలుగా పంపితే వారి స్థానాల్లో నూతన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే ఇంకా బలం కూడా పెరిగే అవకాశం ఉంటుందని జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

అయితే జగన్ భావించినట్టుగానే వారు ఎంపీ పదవికి పోటి చేయడానికి ఇష్టపడుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకంగా పనిచేసి జాతీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్న నేతలు వారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు తప్పకుండా వస్తాయని ఆ ఇద్దరు నేతలు ఇప్పటికే తమ అనుచరులకు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో  జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే వారి నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉండబోతుందో అని చర్చ మొదలైంది.

ఈ ఇద్దరు నేతలు కూడా మంత్రి పదవులు చేపట్టాడానికే ఇష్టపడుతారు కానీ ఎంపీగా పోటి చేయడానికి అంగీకరించరని తెలుస్తోంది. ఒక వేళ జగన్ నిజంగానే వారిపై ఒత్తిడి తెచ్చి ఎంపీలుగా పోటి చేయమంటే వారు అదును చూసి తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరడానికి వారు సిద్దమవుతారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే వీరి విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఉత్తరాంధ్ర నేతల రాజకీయ భవిష్యత్ జగన్ పై ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.