అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది ఇతరత్రా అన్ని పనులు పక్కన బెట్టి భూములు సేకరణలో వున్నారు. ఒకటి ప్రభుత్వం భూములు గుర్తించడం. రెండు అవి లోని చోట అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం. మూడు ప్రైవేటు భూములను కొనుగోలు చేయడం. అంతకు తప్ప అధికారులకు వేరు మార్గం లేదు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ప్రభుత్వ భూములను నిరుపేదలకు పట్టాలు ఇచ్చి వున్నారు. మిగిలినది అతి కొద్ది మాత్రమే. ఆ భూములు ఏ మూలకు చాలవు. మూడవ పద్దతిలో భూములు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించే అవకాశం లేదు. కాబట్టి గతంలో నిరుపేదలకు పట్టాలు ఇచ్చిన భూములపై అధికారులు పడ్డారు.

ఈ అసైన్మెంట్ భూముల్లో ఒక తిరకాసు వుంది. ఎప్పుడో ఒకరి పేర డికెటి పట్టా ఇచ్చారు. కాల క్రమంలో ఈ పట్టా భూములు చేతులు మారాయి. ప్రభుత్వ పట్టా పొందిన పట్టాదారుడు వాటిని వేరే వాళ్లకు అమ్ముకున్నారు . ఇందులో మరో మెలిక వుంది. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారిలో భూములు లేని నిరుపేదలు వున్నారు, భూమి కలిగిన వారు వున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అసలు పట్టాదారుడు అనుభవంలో పట్టా లేకుంటే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

కాని దురదృష్టం ఏమంటే చాల చోట్ల పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అసైన్డ్ భూమి ప్రభుత్వానిది కాబట్టి ఒరిజినల్ పట్టాదారు చేతిలో వున్నా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర మొత్తం మీద గగ్గోలు బయలు చేరింది. కాని ఇందుకు మంత్రులు ఇచ్చే సమాధానం సరిగాలేదు. బలవంతంగా ఎచ్చట స్వాధీనం చేసుకోవడం లేదని ఒక మాట పైగా డికెటి పట్టాలు కొనుగోలు చేసిన వారి నుండి మాత్రమే భూములు స్వాధీనం చేసుకుంటున్నామని చెబుతున్నారు.

మంత్రులు చెప్పేది నిజమైనా కొనుగోలు చేసిన వారు అంత కన్నా నిరుపేదలు అయితే వారిని భూముల నుండి గెంటడం గురించి మాట్లాడటం లేదు. కొనుగోలు దారులు పేరు చెప్పి అందర్నీ వెళ్ల గొట్టుతున్నారు.

చంద్రబాబు నాయుడు పరిపాలనతో కూడా భూములు బలవంతపు సేకరణ ఆయన ఓడి పోవడానికి ఒక కారణంగా వుంది. ఈ అనుభవం ముఖ్యమంత్రి గమనంలోనికి తీసుకోవడం లేదు. 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించాలనే తపనలో అధికారులు తమ టార్గెట్ పూర్తి చేసేందుకు తొక్కే అడ్డదారులు రేపు ప్రభుత్వానికి మెడమీద కత్తిలా వేలాడునున్నది.

రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా సలహా దారుల దృష్టికి వచ్చిందో లేదో తెలియదు గాని పలు ప్రాంతాల్లో చేతికి వచ్చే పంటను అధికారులు నేల పాలు చేసి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలను ఎల్లో మీడియా సృష్టిగా ముఖ్యమంత్రి జమ చేస్తే ఆత్మ ద్రోహం తప్ప వేరు కాదు. ఏ మీడియాలో వచ్చినా నిరుపేదలు కొనుగోలు చేసినభూముల్లో ధనికులు భూముల్లో పంట సాగు చేసి వుంటే రాత్రుల్లో ధ్వంసం చేయడాన్ని ముఖ్యమంత్రి నిరోధించ వలసి వుంది.