అరణ్య రోదనగా మిగిలిపోతున్న రాజధాని రైతుల ఆవేదన 

 

అరణ్య రోదనగా మిగిలిపోతున్న రాజధాని రైతుల ఆవేదన 

 
రాజధానిని అమరావతి నుండి తొలగించి వేరొక చోటుకి మారుస్తాం అనగానే అక్కడి రైతుల గుండెలు పగిలాయి.  రాజధానిని తరలించి తమకు అన్యాయం చేయవద్దని రైతులు ప్రాధేయపడ్డారు.  అయినా ప్రభుత్వ నిర్ణయం మారకపోయేసరికి రోడ్డెక్కారు.  లాఠీ దెబ్బలు తిన్నారు.  అయినా వారు పట్టు వదల్లేదు.  తమకు జరిగిన అన్యాయంపై పోరాటం సాగించారు.  ఈలోపే కరోనా విపత్తు రావడంతో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు.  అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్ఠితి.  
 
అయినప్పటికీ రైతుల్లో పట్టుదల సడల్లేదు.  గాంధేయ మార్గాన్ని ఎంచుకుని ఆందోళనలు స్టార్ట్ చేశారు.  మొదట్లో వారి నిరసనలకు మీడియా మంచి కవరేజ్ ఇచ్చినా ఆ తర్వాత మెల్లగా తగ్గించేశారు.  కరోనా వార్తల నడుమ రైతుల గోడు మరుగున పడింది.  అప్పటికీ రైతుల్లో మనోధైర్యం సడల్లేదు.  మౌనంగానే పోరాటం చేశారు.  ఇప్పటికి వారు ఆందోళనలు మొదలుపెట్టి 159 రోజులు అవుతోంది.  అయినా ప్రభుత్వంలో చలనం లేదు.  ఏ అధికార పక్ష నాయకుడూ వారి గురించి పట్టించుకున్నది లేదు.  కనీసం వారి ప్రస్తావన కూడా లేవనెత్తట్లేదు.  
 
రైతులు మాత్రం అలాగే దీక్షలు చేస్తున్నారు.  రాజధాని కోసం బంగారం పండే భూముల్ని రాసిస్తే ఇప్పుడు వద్దని వెనక్కి తీసుకోమని అనడం దారుణమని, తమ భవిష్యత్తుపై నీళ్లు చల్లడం అన్యాయమని అంటున్నారు.  అయినా ఆమరావతి కట్టడానికి రైతులు భూములు ఇస్తామని ముందుకు రాలేదు.  అప్పటి ప్రభుత్వమే పరిహారం, భవిష్యత్తుపై భరోసా ఇస్టూ ఒప్పించి రాయించుకున్నారు.  కానీ సర్కార్ మారాక మీ త్యాగాలతో మాకు పనేంటి, భూములు వెనక్కి తీసుకోండి అనడం నిజంగా దారుణమే.  
 
ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారితే బలయ్యేది వాటిలో భాగస్వాములైన అమాయకపు ప్రజలే అనడానికి ఇదొక ఉదాహరణ.  కనుక ఇన్ని రోజులుగా పోరాడుతున్న రైతుల గోడు అరణ్య రోదనగా మిగిలిపోకముందే ప్రభుత్వం చొరవ చూపి వారికి తగిన న్యాయం చేస్తే మంచిది.