అయ్యో.. కాంగ్రెసోళ్లు జర మేల్కొండి !

 
ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టు ఉంటారు మన  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని  సూపర్ స్టార్ లా వెలిగిపోతున్నాడు అంటే.. కారణం కాంగ్రెస్ నాయకుల అధికార కాంక్షనే. పోనీ, ఆ అధికారం వస్తోందా అంటే..  అది ఆ దేవుడికే తెలియాలి.  మళ్లీ  ప్రతి ముఖ్యనేత కాబోయే సీఎం అనే చెప్పుకుంటూ పోతారు. ఇక తాజా విషయంలోకి వెళ్తే..   తెలంగాణలో తక్కువ టెస్ట్‌లు చేస్తున్నందువల్లే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఉ‍త్తమ్‌ కుమార్‌ రెడ్డిగారు సెలవిచ్చారు. లాక్ డౌన్ కూడా ఎత్తేసే టైంలో ఇప్పుడు ఈయనగారు టెస్ట్ ల గురించి తీరిగ్గా చెబుతున్నారు.    
 
పైగా లెక్కలు కూడా చెబుతున్నారండోయ్. ‘పక్క రాష్ట్రాల్లో 2 లక్షల టెస్టులు చేస్తే తెలంగాణలో కేవలం 22 వేల టెస్టులు మాత్రమే చేశారట. మరి, రెండు నెలల నుండి  ఉ‍త్తమ్‌ సర్ ఏం చేస్తోన్నట్లు ? కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా పని చేయడం లేదని తెలిసినప్పుడు.. ముందునుంచే తమ వాయిస్ ఎందుకు వినిపించలేదు ? వినిపించాం అనుకుంటే సరిపోదు. అయినా ఇప్పుడు అంతా అయిపోయాక  ముఖ్యమంత్రి తప్పుడు ధోరణి వల్లనే తక్కువ కేసులు నమోదవుతున్నాయని..   రాష్ట్రంలో రోజుకు 5 వేలు టెస్టులు చేయాల్సి ఉంటే కేవలం 200 మాత్రమే చేస్తున్నారని చెబితే.. నమ్మేదెలా ? 
 
నిజానికి రాష్ట్రంలో వలస కూలీలు ఎంత మంది ఉన్నారో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుంది..? అలాగే కేంద్రం నుండి వివిధ వర్గాల నుండి వచ్చిన విరాళాల వివరాలు కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. వీటితో పాటు కరోనాకు ఎంత ఖర్చు చేశారు ? లాంటి అంశాల పై కాంగ్రెస్ నాయకులు పోరాటం అందుకుంటే వారికి మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఆలా కాకుండా, సీన్ అంతా పూర్తయ్యిపోయాక,  అరిగిపోయిన డైలాగ్స్ చెప్పుకుంటూ కూర్చుంటే  వచ్చే ఎన్నికల్లో కూడా బొక్కబోర్లా పడటం తప్ప సాధించేది ఏముండదు. ఇప్పటికైనా కాంగ్రెసోళ్లు మేల్కొంటే మంచిగుంటది.